logo

కుటుంబ వివాదాలు తీర్చే కల్పతరువు

కుటుంబ న్యాయస్థానాలకు హైదరాబాద్‌లోని పురానీహవేలీలో ఏకీకృత కుటుంబ న్యాయస్థాన సముదాయం అత్యాధునిక హంగులతో సిద్ధమైంది.

Published : 20 Mar 2023 02:28 IST

ఈనాడు, హైదరాబాద్‌

పురానీహవేలీలోని ఏకీకృత కుటుంబ న్యాయస్థాన సముదాయం

కుటుంబ న్యాయస్థానాలకు హైదరాబాద్‌లోని పురానీహవేలీలో ఏకీకృత కుటుంబ న్యాయస్థాన సముదాయం అత్యాధునిక హంగులతో సిద్ధమైంది. భవన నిర్మాణ, మరమ్మతులు పూర్తి కావడంతో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు భవనాన్ని ఇటీవల ప్రారంభించారు. దీంతో గృహహింస, విడాకులు, కుటుంబ వివాదాలు, అప్పీళ్లకు సంబంధించి కేసుల పరిష్కారానికి ఒకే వేదిక ఏర్పాటు చేసినట్టయ్యింది. పురానీహవేలీలోని సిటీ సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌లో ఉన్న ఒకటో, రెండో అదనపు ఫ్యామిలీ కోర్టులు, ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టు, నాంపల్లిలోని మనోరంజన్‌ కాంప్లెక్స్‌లో ఉన్న 3వ, 4వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానాలు ఈ భవనంలోకి మారనున్నాయి.

మహిళలు, చిన్నారులకు ప్రత్యేక సదుపాయాలు

1984లో ఏర్పాటు చేసిన ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్‌ భవనంలోనే ఈ ఏకీకృత కుటుంబ న్యాయస్థానం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ భవనం ఖాళీగా ఉండటంతో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసిన అనంతరం హైకోర్టు ఈ భవనాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకుంది. అనంతరం కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో హంగులతో భవనాన్ని తీర్చిదిద్దింది. కుటుంబ న్యాయస్థానాలు సివిల్‌, క్రిమినల్‌ కోర్టుల ప్రాంగణాల్లో ఉండటంతో బాధితులైన మహిళలు, చిన్నారులకు ఇబ్బందికరమైన వాతావరణం ఉండేది. ప్రస్తుతం ఆ సమస్య తలెత్తకుండా సదుపాయాలు కల్పించారు.ః గ్రౌండ్‌ఫ్లోర్‌లో శిశు సంరక్షణ గది, ఆటస్థలం, వేచి ఉండే గది, ధ్యానం, యోగా గది నిర్మించారు. ః మొదటి, రెండు అంతస్తుల్లో కుటుంబ న్యాయస్థానాలు, వాటికి సంబంధించిన సెక్షన్‌ గదులుః మూడో అంతస్తులో గ్రంథాలయం, మనోవికాస కేంద్రం, సమావేశ గది, ఈ-కోర్ట్‌ విభాగం, స్పోర్ట్స్‌ అండ్‌ స్టేషనరీ, దివ్యాంగులు, వయో వృద్ధుల భోజనశాల, వెయిటింగ్‌హాల్‌ః ఇవే కాకుండా అడ్మిన్‌ భవనంలో ఫీడింగ్‌ గదులు, కౌన్సెలింగ్‌ కేంద్రాలు.

శిశు సంరక్షణ గది

అప్పీళ్లకు ఇక ఇబ్బంది లేదు..

నాంపల్లిలోని మనోరంజన్‌ కాంప్లెక్స్‌లోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ గృహహింస కేసులకు సంబంధించి దాఖలయ్యే కేసుల్లో తీర్పులు అనుకూలంగా రాకపోతే.. కక్షిదారులు అప్పీళ్లకు క్రిమినల్‌ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చేది. అయితే ఈ ఇబ్బంది లేకుండా తాజాగా ఏకీకృత కుటుంబ న్యాయస్థాన సముదాయంలోనే అప్పీలు చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడంతో కేసుల దాఖలు, అప్పీలుకు ఒకేచోట అవకాశం కల్పించినట్టయ్యింది. కక్షిదారులు కోర్టును చేరుకునేందుకు ఎంజీబీఎస్‌ మెట్రోస్టేషన్‌ నుంచి ఎలక్ట్రిక్‌ వాహనాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలున్నాయి.

కల్పతరుగా నామకరణం..

జతపడని జంటలకు ఉపశమనాన్ని, గృహహింస బాధితులకు ఆసరాగా, దూరమైన చిన్నారుల మోములో నవ్వును, బాధితులకి న్యాయాన్ని అందించే తరువుగా మారాలని ఈ భవనానికి కల్పతరుగా నామకరణం చేసినట్టు హైకోర్టు సిబ్బంది తెలిపారు.

పెండింగ్‌ కేసుల వివరాలు.. (ఫిబ్రవరి 28 వరకు)

3వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు - 632
4వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు - 759
ప్రిన్సిపల్‌ ఫ్యామిలీ కోర్టు - 1,360
ఒకటో అదనపు ఫ్యామిలీ కోర్టు - 1,526
రెండో అదనపు ఫ్యామిలీ కోర్టు - 1,627


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని