logo

పెళ్లికి ముందే కౌన్సెలింగ్‌తో ప్రయోజనం

దంపతుల మధ్య మనస్పర్థలు దూరం చేయాలంటే పెళ్లికి ముందే కౌన్సెలింగ్‌ ఇచ్చే కేంద్రాల ఏర్పాటు అవసరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధ అభిప్రాయపడ్డారు.

Published : 20 Mar 2023 02:27 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధ

ఉమెన్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీతలతో న్యాయమూర్తి జస్టిస్‌ సుధ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తదితరులు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: దంపతుల మధ్య మనస్పర్థలు దూరం చేయాలంటే పెళ్లికి ముందే కౌన్సెలింగ్‌ ఇచ్చే కేంద్రాల ఏర్పాటు అవసరమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుధ అభిప్రాయపడ్డారు. చిన్నచిన్న సమస్యలను సర్దుబాటు చేసుకోకుండా కొందరు జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో అమీర్‌పేటలోని గ్రీన్‌పార్క్‌ హోటల్‌లో ఆదివారం మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ సుధ మాట్లాడుతూ.. భారతీయ కుటుంబ వ్యవస్థను కాపాడి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరముందని చెప్పారు. మహిళల హక్కులను గుర్తించి, వాటిని పరిరక్షించేందకు ప్రతీ ఒక్కరూ కృషి చెయ్యాలన్నారు. ప్రతిభావంతులైన మహిళలను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఇతరులకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాన్ని నిర్వహించిన అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులను అభినందించారు.

మహిళల హక్కులు చట్టాలుగా తేవాలి.. గౌరవ అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ సురభి వాణీదేవి మాట్లాడుతూ.. అన్నిరంగాల్లానే న్యాయ వ్యవస్థలోనూ మహిళల భాగస్వామ్యం పెరగాలన్నారు. మహిళలకు అవసరమైన హక్కులను చట్టాలుగా తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమ నిర్వాహకులు, అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు మధు బొమ్మినేని వర్చువల్‌గా ప్రసంగించారు. అంతకుముందు వివిధ రంగాల్లో ప్రతభావంతులైన 16 మంది మహిళలకు ఉమెన్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు జయంత్‌ చల్లా, కవితాచల్లా, డా.సురేందర్‌రెడ్డి, లోహిత్‌కుమార్‌, ఇందుప్రియ, అమృత్‌ ముళ్లపూడి, రాజ్‌కుమార్‌ నట్టుపల్లి, సూర్యచందర్‌రెడ్డి, జగన్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని