Bandi Sanjay: కాలయాపన చేయకుండా రైతులను ఆదుకోండి: సీఎంకు బండి సంజయ్‌ లేఖ

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేసుంటే.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా యుద్ధప్రాతిపదికన నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Published : 20 Mar 2023 16:39 IST

హైదరాబాద్‌: తెలంగాణలో అకాల వర్షాలతో 5లక్షల ఎకరాలకుపైగా పంట దెబ్బతిందని.. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించి ఆదుకోవాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోతే ఆదుకొనేందుకు రాష్ట్రంలో ఇప్పటివరకు సమగ్ర పంట బీమా పథకాన్ని రూపొందించకపోవడం బాధాకరమన్నారు. పథకం రూపొందించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా ఏళ్ల తరబడి అన్నదాతలు నష్టపోతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజన పథకాన్ని తెలంగాణలో అమలు చేసుంటే.. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందేదని బండి సంజయ్‌ అన్నారు. భాజపాకు పేరొస్తుందనే అక్కసుతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం లేదని విమర్శించారు. కనీసం ఇప్పటికైనా స్పందించి సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సర్వేలు, నివేదికల పేరుతో కాలయాపన చేయకుండా యుద్ధప్రాతిపదికన నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించేందుకు రైతులకు ఉచితంగా ఎరువులు, విత్తనాలు అందిస్తామని గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు. వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరికీ రైతుబంధుతోపాటు ఉచితంగా యూరియా, విత్తనాలను అందించాలని బండి సంజయ్‌ లేఖ ద్వారా సీఎం కేసీఆర్‌ను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని