logo

పురపాలికల్లో.. సమస్యల రాజ్యం

జిల్లాలోని పురపాలికల్లో మౌలిక వసతుల లోపంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు.

Published : 21 Mar 2023 01:04 IST

దృష్టి సారించాలి అధికారులు

తాండూరు పట్టణంలో ఇలా

న్యూస్‌టుడే, తాండూరు, వికారాబాద్‌ మున్సిపాలిటీ, పరిగి, కొడంగల్‌: జిల్లాలోని పురపాలికల్లో మౌలిక వసతుల లోపంతో ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. పన్నుల వసూళ్లపై అధికారులు చూపుతున్న శ్రద్ధ సౌకర్యాల కల్పనపై చూపడంలేదని విమర్శలొస్తున్నాయి. ప్రస్తుత ఎండా కాలంలోనైనా కార్యాచరణ చేపట్టాలని కోరుతున్నారు.  


రెండు కొత్తవి, రెండు పాతవి

తాండూరు, వికారాబాద్‌ మున్సిపాలిటీలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. కొడంగల్‌, పరిగి పురపాలికలు మాత్రం మూడేళ్ల క్రితమే ఏర్పడ్డాయి. అన్నింటా కలిపి ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ.16.12 కోట్ల మేర పన్నులు వసూలు కావాల్సి ఉండగా రూ.8.85 కోట్లు సేకరించారు. సంపూర్ణంగా సేకరించగలిగితే పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగు పరచడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో పారిశుద్ధ్య లోపం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై దృష్టి సారించక పోవడంతో అవస్థల పాలవుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.  


ఇదీ పరిస్థితి..

* వికారాబాద్‌ మున్సిపాలిటీలో స్వయంగా మున్సిపల్‌ అధ్యక్షురాలే సమస్యలు తెలుసుకోవడానికి ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం వారం వారం నిర్వహిస్తున్నారు. ప్రతిసారీ 15కు తగ్గకుండా ప్రజల నుంచి విన్నపాలు వస్తున్నాయి. ఇక పట్టణంలో రోడ్లు, పరిశుభ్రత గురించి ఎంత చెప్పినా తక్కువే..

* తాండూరులో చిన్నపాటి వర్షం పడినా చాలు డ్రైనేజీలు పొంగి రహదారులు బురదమయంగా మారుతున్నాయి. చెత్తకుప్పలు, మురికి నీటి గుంటల్లో నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. పందులు ఇష్టారాజ్యంగా తిరుగుతూ వ్యాధులకు కారణమవుతున్నాయి

* కొడంగల్‌లో కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పట్టణంలోని బస్టాండ్‌, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇరుకు రహదారులపైనే చిరు వ్యాపారులు లావాదేవీలు నిర్వహించాల్సి వస్తోంది. నిలువ నీడ లేక ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు.

* పరిగి మున్సిపాలిటీలో అనేక సమస్యలు తిష్టవేశాయి. ప్రధానంగా అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు లేకపోవడం, పారిశుధ్య సమస్యలతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పన్నులను ముక్కుపిండి వసూలు చేస్తున్న అధికారులు సమస్యలు పరిష్కరించాలని విన్నవిస్తున్నా పట్టించుకోవడం లేదని కాలనీల ప్రజలు ఆరోపిస్తున్నారు. చినుకు పడితే చాలు మందుల కాలనీ, ఖాన్‌, బీసీ కాలనీల వాసుల్లో వణుకు పుడుతోంది. ఇళ్లలోకి నీరు చేరి పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. రాత్రి పూట దోమల బెడద అధికమవుతోందని వాపోతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని