logo

ఉగాదికి చేదు కబురు

తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం ఉగాది అనగానే షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడి గుర్తుకొస్తుంది.

Published : 21 Mar 2023 03:06 IST

ఈనాడు, హైదరాబాద్‌: తెలుగు ప్రజలకు నూతన సంవత్సరం ఉగాది అనగానే షడ్రుచుల సమ్మేళనంతో కూడిన పచ్చడి గుర్తుకొస్తుంది. ఈసారి పచ్చడి కోసం ఎదురుచూసే వారికి ‘చేదు’ కబురు మిగిలేలా కనిపిస్తోంది. ఉగాది పండగ దగ్గరికొచ్చినా వేప చేదు దొరికేలా కనిపించడం లేదు. నగరంలోని ఎక్కువ వేప చెట్లకు పూత కనిపించకపోవడమే ఇందుకు కారణం. ఎక్కడ చూసినా పూత రాని, చిగురుటాకులు ఎండిపోయిన చెట్లు దర్శనమిస్తున్నాయి. కొన్నింటికి పూత ఉన్నా.. వృక్షం మధ్యభాగంలో ఎండిపోవడంతో దాన్ని వినియోగించాలా..? వద్దా..? అనే మీమాంస ఎదురవుతోంది.


వాతావరణ పరిస్థితులతో..

మారిన వాతావరణ, తెగులు కారణంగా ఈసారి పూత బాగా తగ్గిపోయినట్లు ఉద్యాన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవలికాలంలో వివిధ వ్యాధులు, తెగుళ్లతో వేప చెట్లు మధ్యభాగంలో ఎండిపోయాయి. గతేడాది కుండపోత వర్షాలు, ఒక్కసారిగా అకాల వర్షాలు, ఎక్కువ తేమ కారణంగా వృక్షాలు ఎండిపోయాయి. దీని తర్వాత వాతావరణంలో మార్పులు రావడమూ తెగులుకు తోడైంది. ఫలితంగా పూత బాగా తగ్గిపోయింది.  మూడు నాలుగేళ్లకోసారి జన్యుక్రమంలో భాగంగా వేప చెట్లు ఎండిపోయి ఫలితంగా పూత రాకపోవడం కనిపిస్తుంది. ఆ తర్వాత యథావిధిగా చెట్లు ఏపుగా పచ్చగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.


ఎండిపోయినా పూత వాడొచ్చు..

‘‘వాతావరణ మార్పులతో పూత తక్కువగా కనిపిస్తోంది. శిలీంధ్రం కారణంగా ఎండిపోయిన చెట్ల పూత వాడొద్దనే అపోహ ఉంది. అది సరికాదు. పూత వాడొచ్చు. చెట్లకు పురుగుమందులు భారీగా వాడాల్సిన అవసరం లేదు. ఎక్కువ వాడితే పరిసరాల్లోని వాటికి ప్రమాదం వాటిల్లుతుంది. నర్సరీలో ఉన్నవాటిని జాగ్రత్తగా సంరక్షిస్తే సరిపోతుంది’’ - డా.జగదీశ్వర్‌, విశ్రాంత పరిశోధనా సంచాలకులు, ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని