logo

ఎల్బీనగర్‌ పైవంతెన సిద్ధం

ఎల్బీనగర్‌ కూడలి పైవంతెన పనులు పూర్తయ్యాయి. మెరుగులద్ది ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని జీహెచ్‌ఎంసీ సోమవారం ప్రకటించింది.

Published : 21 Mar 2023 07:51 IST

నెలాఖరులోపు ప్రారంభిస్తాం: బల్దియా

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ కూడలి పైవంతెన పనులు పూర్తయ్యాయి. మెరుగులద్ది ప్రారంభోత్సవానికి సిద్ధం చేశామని జీహెచ్‌ఎంసీ సోమవారం ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా నెలాఖరు లోపే ప్రారంభోత్సవం ఉండే అవకాశముందని ఇంజినీర్లు తెలిపారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ)లో భాగంగా ఎల్బీనగర్‌ కూడలిలో చేపట్టిన రెండో పైవంతెన ఇది. మొదటిదైన ఎడమ వైపు పైవంతెన(ఎల్‌హెచ్‌ఎస్‌) నాలుగేళ్ల క్రితమే అందుబాటులోకి వచ్చింది. వాహనాలు కూడలి వద్ద ఆగకుండా.. చైతన్యపురి నుంచి హయత్‌నగర్‌ వైపు వెళ్లేందుకు ఆ పైవంతెన ఉపయోగపడుతుంది. హయత్‌నగర్‌ నుంచి చైతన్యపురి వైపు ప్రయాణించే వాహనాల కోసం కుడి వైపు పైవంతెన(ఆర్‌హెచ్‌ఎస్‌) నిర్మాణాన్ని చేపట్టగా.. ఎల్బీనగర్‌ కూడలిలో భూసేకరణ సమస్య తలెత్తి జాప్యం చోటు చేసుకుంది. ఏడాది కిందట సమస్య పరిష్కారమవడంతో.. పైవంతెన పనులు పూర్తై ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. అంబర్‌పేట గోల్నాక చౌరస్తా నుంచి రామంతాపూర్‌ వైపు, శివరాంపల్లి చౌరస్తా నుంచి శంషాబాద్‌ వరకు నిర్మించ తలపెట్టిన పైవంతెనలు సైతం త్వరలో అందుబాటులోకి వస్తాయని ఇంజినీర్లు వివరించారు. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు 35 పూర్తయినట్లు గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని