logo

ఆటకు చోటేది?

మైదానాల్లో ఆడుకుంటూ ఆనందంగా గడపాల్సిన బాల్యం.. ఆన్‌లైన్‌లో వీడియోగేమ్‌లు, సెల్‌ఫోన్‌లో కార్టూన్‌ చిత్రాలను వీక్షించడానికే పరిమితమవుతోంది.

Updated : 21 Mar 2023 03:33 IST

మైదానాల్లేకుండానే 70శాతం ప్రైవేటు పాఠశాలలు
బల్దియా ప్రాంగణాలనూ పట్టించుకోని యాజమాన్యాలు


ఈనాడు, హైదరాబాద్‌: మైదానాల్లో ఆడుకుంటూ ఆనందంగా గడపాల్సిన బాల్యం.. ఆన్‌లైన్‌లో వీడియోగేమ్‌లు, సెల్‌ఫోన్‌లో కార్టూన్‌ చిత్రాలను వీక్షించడానికే పరిమితమవుతోంది. ఇంటి నుంచి బడికి, బడి నుంచి ఇంటికి చేరుకోవడమే ఏకైక శారీరక శ్రమ అన్నట్లు తయారైంది నగరంలో పరిస్థితి. ఇరుకు గదుల్లో నడిచే కొన్ని ప్రైవేటు పాఠశాలలు, వాటికి అనుమతులిస్తోన్న ఉన్నతాధికారులే కారణమనే విమర్శలొస్తున్నాయి. మైదానాలు, ఆటస్థలాలు లేని పాఠశాలలు తప్పనిసరిగా.. జీహెచ్‌ఎంసీ మైదానాలను ఏడాదిపాటు లీజుకు తీసుకోవాలన్న నిబంధనను సైతం విద్యాశాఖ బేఖాతరు చేస్తోంది. జీహెచ్‌ఎంసీ యంత్రాంగమూ మొద్దునిద్ర పోతోంది.

నగరంలో 20లక్షల విద్యార్థులు..

గ్రేటర్‌ పరిధిలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 20లక్షల మంది విద్యార్థులున్నారు. అందులో సగానికిపైగా ప్రైవేటు పాఠశాలల వారే. సుమారు 7వేల ప్రైవేటు పాఠశాలలుండగా, వాటిలోని 70శాతం బడులకు సరైన ఆట స్థలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో.. ఆయా విద్యాసంస్థలకు జీహెచ్‌ఎంసీ క్రీడల విభాగం ఓ పిలుపునిచ్చింది. డాక్టర్‌ బి.జనార్దన్‌రెడ్డి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు.. బల్దియాకు చెందిన 521 మైదానాలను విద్యాసంస్థలకు అద్దెకివ్వాలని నిర్ణయించారు. వాటికి అదనంగా నెలవారీ రుసుముతో స్పోర్ట్స్‌ కాంప్లెక్సులు, ఈత కొలనులు, ఇండోర్‌ స్టేడియాలు, అవుట్‌ డోర్‌ స్టేడియాలు, ఇతరత్రా ప్రాంగణాలను అద్దెకు తీసుకునే వసతి కల్పించారు. నవంబరు, 2017 నుంచి ఈ ‘పే అండ్‌ ప్లే’ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. ఆ మేరకు 2017 నుంచి 2020 వరకు ప్రతి సంవత్సరం 200కు పైగా పాఠశాలలు మైదానాలను అద్దెకు తీసుకుని, సద్వినియోగం చేసుకున్నాయి. కొవిడ్‌ వ్యాప్తితో 2020, 2021 విద్యాసంవత్సరాల్లో పాఠశాలలకు ఆ అవసరం రాలేదు. కొవిడ్‌ సమస్య ముగిశాక.. పాఠశాలల యాజమాన్యాలు క్రీడల అవసరాన్ని మర్చిపోయాయి.

రాబోయే విద్యా సంవత్సరానికైనా..

మైదానాలకు అద్దెకివ్వడం ద్వారా జీహెచ్‌ఎంసీ ఖాజానాకు వచ్చేది ఆదాయం రూ.30లక్షలు మాత్రమే. కానీ.. చిన్నారుల బంగారు భవిష్యత్తుకు ఆటపాటలు దోహదపడతాయి. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను విద్యార్థులు దీటుగా ఎదుర్కోగలరు. పాఠశాలల యాజమాన్యాలు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని, జీహెచ్‌ఎంసీ ఆ దిశగా యాజమాన్యాలను చైతన్యవంతం చేయాలని, రాబోయే విద్యా సంవత్సరంలో ప్రతి బడికి మైదానం తప్పనిసరి అనేట్లు విద్యాశాఖ ఆదేశాలివ్వాలని నిపుణులు కోరుతున్నారు.


‘పే అండ్‌ ప్లే’లో భాగమైన క్రీడా వసతులు ఇలా..

క్రీడా మైదానాలు : 21
స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు : 13
ఇండోర్‌ స్టేడియాలు : 14
అవుట్‌డోర్‌ స్టేడియాలు : 9
స్విమ్మింగ్‌పూల్స్‌ : 10
ప్రైవేట్‌ పాఠశాలల అవసరాల కోసం కేటాయించిన మైదానాలు : 521


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని