logo

క్రమబద్ధీకరణకు మరో అవకాశం

ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న పేదలు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు.

Published : 21 Mar 2023 07:51 IST

ప్రభుత్వ స్థలాల్లోని బస్తీవాసుల సంతోషం
క్రమంగా పెరుగుతున్న దరఖాస్తులు

ఫిలింనగర్‌లో బస్తీలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ఫిలింనగర్‌: ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకుని క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న పేదలు మీ-సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు గడువు జూన్‌ 2, 2014 నుంచి జూన్‌ 2, 2020కి పొడిగించడంతో వందల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. దీంతో నగరంలోని ఫిలింనగర్‌, బోరబండ, రహమత్‌నగర్‌, ఆసిఫ్‌నగర్‌, సికింద్రాబాద్‌, మారేడ్‌పల్లి ప్రాంతాల్లో నివాసముంటున్న వారిలో దాదాపు 90శాతం మంది అర్హులు కానున్నారు. రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని వారికీ ఊరట కలగనుంది.


ఆధార్‌ కార్డులు.. చిరునామాలతో..

ఫిలింనగర్‌, బోరబండ, రహమత్‌నగర్‌, ఎస్పీఆర్‌హిల్స్‌ భోజగుట్ట, రంగారెడ్డి జిల్లాలో సరూర్‌నగర్‌, రాజేంద్రనగర్‌, మేడ్చల్‌ జిల్లాలోని కుత్బుల్లాపూర్‌, జగద్గిరిగుట్ట, సూరారం కాలనీ, పేట్‌బషీరాబాద్‌ ప్రాంతాల్లో ఎంతోమంది దశాబ్దాల కిందటే నివాసయోగ్యం లేని ప్రాంతాల్లో ఇళ్లు, గుడిసెలు నిర్మించుకున్నారు. వీరంతా స్థలాలను క్రమబద్ధీకరించాలంటూ కొన్నేళ్లుగా ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నారు. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లోని ప్రైవేటు భూముల ధరలు రూ.లక్షల నుంచి రూ.కోట్లకు పెరగడంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రం ఆవిర్భంచిన తర్వాత జూన్‌ 2, 2014 తేదీలోపు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరించగా... పక్కా ఇళ్లు నిర్మించుకున్న వారికి మార్కెట్‌ రేట్‌కు అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని విధివిధానాలను రూపొందించారు. ఆధార్‌కార్డులు, చిరునామాలతో క్రమబద్ధీకరించుకొనే అవకాశం కల్పించారు.


కేంద్ర ప్రభుత్వ స్థలాల్లో..

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించగా కొంతమంది ప్రైవేటు స్థలాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూముల్లో గుడిసెలు వేసుకున్నట్లు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ భూముల్లో ఉంటున్నవారికి క్రమబద్ధీకరణ వర్తించదని అధికారులు స్పష్టం చేశారు. వీరంతా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని