logo

జాడలేని డబుల్‌డెక్కర్‌ బస్సులు

నగరంలో డబుల్‌డెక్కర్‌ బస్సులు మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయాయి. హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసిన ఈ బస్సులు ‘ఫార్ములా ఈ - రేసింగ్‌’ రోజుల్లో తళుక్కున మెరిశాయి.

Published : 21 Mar 2023 02:46 IST

 తీరని నగర ప్రయాణికుల ముచ్చట

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో డబుల్‌డెక్కర్‌ బస్సులు మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయాయి. హెచ్‌ఎండీఏ కొనుగోలు చేసిన ఈ బస్సులు ‘ఫార్ములా ఈ - రేసింగ్‌’ రోజుల్లో తళుక్కున మెరిశాయి. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లోనే తిరిగినా.. తర్వాత ఇవి నగరంలోని పర్యాటక ప్రాంతాలను చుట్టి వస్తాయని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆ బస్సుల జాడ లేకుండా పోయింది.  


3 నుంచి 30కి చేరుతుందనుకుంటే..

ప్రస్తుతానికి 3 డబుల్‌డెక్కర్‌ బస్సులు వచ్చాయి. నెలా, రెండు నెలల్లో మరో 3 బస్సులు వస్తాయి.. ఇలా 30 బస్సుల వరకూ రానున్నాయి. ఇలా అనేక ఊసులు బస్సులకంటే వేగంగా చక్కర్లు తిరిగాయి. ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ - రేసింగ్‌’ సందర్భంగా ట్యాంకుబండ్‌ పరిసరాల్లో చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ రేసు చూడడానికి వచ్చిన నగర యువత బస్సుల్లో విహరించారు కూడా. ఎంతో సౌకర్యంగా ఉన్నాయని కితాబు ఇచ్చారు. నగర పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డులో తిరిగాయి. కాని తర్వాత ఏమైందో ఏమో.. అవి ఎక్కడా కనబడడం లేదు.


ఎవరికిస్తారో ఇంకా గందరగోళమే..

ఒక్కో బస్సుపై రూ. 2 కోట్లకు పైగా వెచ్చించి హెచ్‌ఎండీఏ 3 డబుల్‌డెక్కర్‌ బస్సులు కొన్నది. ఇంకా మూడు.. మరో 30 బస్సులు వస్తే.. వాటిని ఎవరు తిప్పాలి అనే సందేహాలు కూడా వచ్చాయి. ఆర్టీసీకి ఇచ్చి ప్రజారవాణాలో పెడతారా..? పర్యాటకానికి ఇచ్చి సందర్శనా స్థలాలకే పరిమితం చేస్తారా.. ఇలా పలు రకాల ప్రతిపాదనలు వినిపించాయి. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. రహదారుల్లో తిరగాల్సిన డబుల్‌డెక్కర్లు షెడ్డుకు పరిమితమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని