logo

ఒక్క అడుగు.. రేపటి వెలుగు

కారణమేదైనా దొంగలుగా మారారు.. చోరీల్లో ఆరితేరడంతో తరచూ జైలు జీవితం. ఫలితం కకావికలమైన కుటుంబం.

Published : 21 Mar 2023 02:46 IST

నేరస్థుల్లో మార్పునకు వినూత్న కార్యక్రమం
రాచకొండ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ప్రారంభం
కొత్త జీవితం.. ఉపాధి కల్పించే దిశగా అడుగులు

ఈనాడు- హైదరాబాద్‌: కారణమేదైనా దొంగలుగా మారారు.. చోరీల్లో ఆరితేరడంతో తరచూ జైలు జీవితం. ఫలితం కకావికలమైన కుటుంబం. బెయిలు కోసం న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ అప్పులు చేసే భార్య. బడికి దూరమై దుర్భర జీవితం గడిపే చిన్నారులు.. ఇరుగుపొరుగు చిన్నచూపు.. ఎంతో మంది నేరస్థుల కుటుంబాలు అనుభవించే మానసిక క్షోభ ఇది. ఈ తరహా దయనీయ పరిస్థితుల నుంచి నేరగాళ్లు, వాళ్ల కుటుంబాల్ని బయటపడేసేందుకు రాచకొండ పోలీసులు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరగాళ్లు చోరీల బాట వదిలి.. తలెత్తుకుని జీవించేలా ‘మార్పు కోసం ముందడుగు’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారిలో మార్పు తీసుకొచ్చి.. ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం, కుటుంబం గౌరవంగా జీవించేలా భవిష్యత్తుకు భరోసా కల్పించడమే దీని ఉద్దేశం.


తొలి విడతలో 318 మంది

* ‘మార్పు కోసం ముందడుగు’ కార్యక్రమంలో రాచకొండ క్రైమ్స్‌ విభాగం అధికారులు నేర చరిత్ర ఉన్న వ్యక్తుల్ని గుర్తిస్తారు.
* తొలి దశలో రాచకొండలోని 9 పోలీస్‌స్టేషన్ల పరిధిలో పదేపదే చోరీలు చేసే 318మంది పాత నేరస్థులను గుర్తించారు. వారి ఆర్థిక, జీవన, కుటుంబ స్థితిగతులు, ఆరోగ్య వివరాలన్నీ నమోదుచేస్తారు.
* పూర్తిగా నేరాలు మానేసి కొత్త జీవితాన్ని ప్రారంభించేలా మానసిక నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తారు.
* గత 5-10 ఏళ్ల మధ్య నేరాలకు పాల్పడకుంటే వారిపై నేర చరిత్రను పోలీసులే తొలగిస్తారు.
* వారికి స్వయం ఉపాధి కోసం.. కొన్ని స్వచ్ఛంద సంస్థలతో మాట్లాడి ఆర్థిక సాయం అందించేలా ఏర్పాటుచేస్తారు.
* టీ దుకాణాలు, పరిశ్రమలతో మాట్లాడి అందులో ఉద్యోగాలు ఇప్పిస్తారు.
* పిల్లలుంటే వారికి గురుకులాల్లో ప్రవేశాలు ఇప్పించేలా పోలీసు శాఖ తరఫున మాట్లాడతారు.
* ఎక్కువ మంది నేరస్థులు గంజాయి, మద్యం వ్యసనాలతో సతమతమవుతున్నారు. ఇలాంటివారికి ప్రముఖ మానిసిక వైద్యులతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తారు.


మళ్లీ నేరాల బాట పట్టకుండా..

చోరీ కేసుల్లో ఎక్కువ మంది నిందితులు పాత నేరస్థులే. ఎన్నిసార్లు జైలుకెళ్లినా వారిలో మార్పు రావడం లేదు. ఇలాంటి వారే లక్ష్యంగా ‘మార్పు కోసం ముందడుగు’ కార్యక్రమం చేపట్టారు. దీంతో చోరీలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ పోలీసులు కౌన్సెలింగ్‌ ఇప్పించి ఉపాధి కల్పించిన తర్వాత మార్పు రాకుంటే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటారు. గతంలో కొన్ని ఠాణాల పరిధిలో పాత నేరస్థుల్లో మార్పు తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు వారికి ఉపాధి కల్పించారు. కొన్నిరోజులు బుద్ధిగా పనిచేసుకుని మళ్లీ చోరీల బాట పట్టారు. ఈ తరహా ఘటనల నేపథ్యంలో మరింత పక్కాగా కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు.


మార్పు తీసుకొచ్చే ప్రయత్నం
-మధుకర్‌ స్వామి, డీసీపీ రాచకొండ క్రైం విభాగం

వరుసగా నేరాలు పాల్పడే వ్యక్తులతో సమాజానికి ఇబ్బందే. ఎంతో మంది ఆర్థిక ఇబ్బందులు, ఇతర సమస్యలతో తెలిసోతెలియకో చోరీల బాట పట్టి జైల్లో దుర్భర జీవితం గడుపుతారు. ఈ నేపథ్యంలోనే పాత నేరస్థులను గుర్తించి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఐదేళ్లకు మించి నేరాలకు పాల్పడకుంటే కచ్చితంగా అధికారులతో మాట్లాడి నేర చరిత్ర తొలగిస్తాం. ఇప్పటికే ప్రాథమికంగా ఒక సమావేశం నిర్వహించాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని