logo

Hyd Airport Metro: విమానాశ్రయ మెట్రోకు ప్రైవేటు ఆస్తుల సేకరణ

విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకి ప్రధానంగా రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు.

Updated : 22 Mar 2023 13:20 IST

 మలుపుల వద్ద అనివార్యం అంటున్న యంత్రాంగం
కసరత్తు చేస్తున్న హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ మెట్రో

ఈనాడు, హైదరాబాద్‌ : విమానాశ్రయ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకి ప్రధానంగా రెండు ప్రాంతాల్లో భూసేకరణ చేపట్టాల్సి ఉంటుందని అధికారులు గుర్తించారు. అలైన్‌మెంట్‌ మార్కింగ్‌ పూర్తికావడంతో ఎక్కడెక్కడ ఆస్తుల సేకరణ అవసరమో నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా మలుపులు ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్తులను సేకరించాల్సి వస్తోంది. ఖాజాగూడ, నానక్‌రాంగూడ, శంషాబాద్‌ ప్రాంతాల్లో మెట్రో అలైన్‌మెంట్‌లో మలుపులు ఉన్నాయి. అన్నిచోట్ల కలిపి కిలోమీటర్‌ మేర ఆస్తులను సేకరించాల్సి ఉంది. వీటిలో 95 శాతం ఖాళీ స్థలాలే ఉన్నాయి. మరో 5 శాతం వరకు భవనాలు ఉన్నాయి.

మొత్తం 31 కి.మీ. మార్గంలో 30 కి.మీ. మేర ఆస్తుల సేకరణ సమస్యలు లేవు. ఓఆర్‌ఆర్‌, ప్రభుత్వ భూముల్లోంచి అలైన్‌మెంట్‌ వెళుతుంది. ఒక కిలోమీటర్‌ మేర మాత్రం ప్రైవేటు ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. ఖాజాగూడలో మలుపు వద్ద కొన్ని ఆస్తులు సేకరించాల్సి ఉంది. ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు నుంచి శంషాబాద్‌ పట్టణంలోకి వెళ్లేచోట జాతీయ రహదారి వరకు కొన్ని ఆస్తులను సేకరించాల్సి ఉంటుందని గుర్తించారు.  

నాలుగు రకాలుగా ప్రయాణం.. : విమానాశ్రయ మెట్రో అలైన్‌మెంట్‌ నానక్‌రాంగూడ చౌరస్తా నుంచి శంషాబాద్‌ వరకు ఔటర్‌ సర్వీసు రోడ్డు పక్క నుంచి వెళుతుంది. అయితే అప్పా కూడలి వరకు తొలుత మెట్రో నిర్మించాలనుకున్న ప్రదేశంలో అత్యాధునిక సైకిల్‌ ట్రాక్‌ వస్తోంది. దీంతో ఇక్కడ సర్వీస్‌ రోడ్డు, సైకిల్‌ ట్రాక్‌ మధ్యన మెట్రో అలైన్‌మెంట్‌ వెళుతుంది. ఈమార్గంలో సర్వీసు రోడ్డును ప్రస్తుతం విస్తరిస్తున్నారు.  ఈ రహదారి భవిష్యత్తులో ఒక ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఒకవైపు సర్వీసురోడ్డు, తర్వాత మెట్రో, సైకిల్‌ ట్రాక్‌, ఆపై ఓఆర్‌ఆర్‌.. ఇలా నాలుగు రకాలుగా ప్రయాణం సాగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని