logo

Hyderabad: కూతురు ప్రేమ వివాహం.. ఉరేసుకున్న తల్లి

కూతురి ప్రేమ వివాహం కారణంగా మానసిక వ్యధకు గురైన తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది

Updated : 22 Mar 2023 07:39 IST

నిర్మల

మూసాపేట: కూతురి ప్రేమ వివాహం కారణంగా మానసిక వ్యధకు గురైన తల్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కూకట్‌పల్లి పోలీసులు, మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లి జయానగర్‌కాలనీలోని మైత్రేయి నిలయంలో ప్రైవేటు ఉద్యోగి గోనుగుంట శ్రీనివాసరావు, నిర్మల(45) కుటుంబం ఉంటోంది. వీరికి కుమారుడు సాయితేజ, కుమార్తె ఉన్నారు. కుమార్తె తన సహ విద్యార్థిని ప్రేమించింది. ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిపోయి వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తల్లి మదనపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మంగళవారం ఉదయం బెడ్‌రూంలోకి వెళ్లి తలుపేసుకుని, ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు మరో తాళంచెవితో తలుపులు తెరిచి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కన్పించింది.


కానిస్టేబుల్‌తో ప్రేమ పెళ్లి.. వరకట్నం వేధింపులతో బలవన్మరణం

సైదాబాద్‌, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకొని అదనపు కట్నం కోసం పీడిస్తుండటంతో యువతి ఆత్మహత్య చేసుకుంది. మలక్‌పే పోలీసుల సమాచారం ప్రకారం.. తిరుమలగిరి ఎస్బీహెచ్‌ కాలనీ నివాసి వడ్ల శ్రీనివాస్‌, రేణుక కుమార్తె పవిత్ర(27) తిరుమలగిరి ఠాణాలో పనిచేసే కె.అవినాశ్‌ను ప్రేమించి, 2016 జూన్‌ 6న పెళ్లి చేసుకుంది. వీరు మలక్‌పేటలోని బీ-బ్లాక్‌ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి అవిక్షిత(5) కుమార్తె ఉంది. అవినాశ్‌ మద్యానికి బానిసై తరచూ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. యువతి ఆమె కుటుంబసభ్యులు మహిళా ఠాణాను ఆశ్రయించగా అక్కడ కౌన్సెలింగ్‌ ఇచ్చినా అతని తీరు మారలేదు. 2 నెలల కిందట ప్రవర్తన మార్చుకుంటా, భార్యతో మంచిగా ఉంటానని.. మద్యం మానేస్తానని నమ్మబలకడంతో.. అతనికి అత్తింటివారు రూ.2 లక్షలు డౌన్‌ పేమెంట్‌ కట్టి కారు కొనిచ్చారు. ఈ నెల 20న మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అవినాశ్‌.. పవిత్రతో గొడవ పడ్డాడు. సాయంత్రం పవిత్ర ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాస్‌ ఫిర్యాదు మేర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని