TSPSC: నిందితుల కాల్‌ డేటా ఆధారంగా దర్యాప్తు.. 40మంది టీఎస్‌పీఎస్సీ సిబ్బందికి సిట్‌ నోటీసులు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి దాదాపు 40మంది సిబ్బందికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో కొంతమందికి 100 మార్కులకుపైగా వచ్చినట్లు సమాచారం.

Updated : 22 Mar 2023 18:55 IST

హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో 9 మంది నిందితులను అదుపులోకి తీసుకుని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కాల్‌డేటాను పరిశీలించారు. పరీక్ష నిర్వహించిన సమయంలో ఎక్కువగా ఎవరెవరితో మాట్లాడారనే విషయాన్ని తెలుసుకొని వారందరికీ నోటీసులు జారీ చేశారు. 

అంతేకాకుండా నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డికి టీఎస్‌పీఎస్సీలో ఎవరు సహకరించారనే దానిపై సిట్‌ అధికారులు దృష్టి సారించారు. ఈ క్రమంలో ఇప్పటికే టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తూ 10 మందికి పైగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసి మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు సిట్‌ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వారిని కార్యాలయానికి పిలిచి విచారించారు. లీకేజీకి సంబంధించి దాదాపు 40మంది సిబ్బందికి కూడా సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో కొందరికి 100 మార్కులకుపైగా వచ్చినట్లు సమాచారం. టీఎస్‌పీఎస్సీ నుంచి మరిన్ని వివరాలు రావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల వస్తే టీఎస్‌పీఎస్సీ సిబ్బంది ఎంతమంది గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రాశారు? ఇందులో ఎంతమందికి 100 మార్కులు వచ్చాయి? అనే విషయంపై సిట్‌ అధికారులకు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు నిందితురాలు రేణుక, ఆమె భర్త డాక్య పలువురు పోటీ పరీక్షల అభ్యర్థులతో పాటు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులతో మాట్లాడినట్టు సిట్‌ అధికారులు అనుమానిస్తున్నారు. రేణుక కాల్‌ డేటా ఆధారంగా అభ్యర్థులతో పాటు, కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వైపు ఈకేసులో 9మంది నిందితుల ఐదో రోజు కస్టడీ ముగిసింది. నిందితులను సిట్‌ కార్యాలయం నుంచి మధ్య మండల డీసీపీ కార్యాలయానికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని