logo

ఆదర్శంగా తీర్చిదిద్దేలా.. ఆశయం నెరవేరేలా..

దేశం సాంకేతికపరంగా ఎంత అభ్యున్నతి సాధించినా, అత్యధిక జనాభా నివాసం ఉండేది ఇప్పటికీ గ్రామాల్లోనే. ఎంతమందికైనా ఇక్కడ ఉపాధికి కొరత ఉండదు.

Updated : 23 Mar 2023 03:57 IST

పల్లెల్లో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కార్యాచరణ

గ్రామస్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న సిబ్బంది

న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌: దేశం సాంకేతికపరంగా ఎంత అభ్యున్నతి సాధించినా, అత్యధిక జనాభా నివాసం ఉండేది ఇప్పటికీ గ్రామాల్లోనే. ఎంతమందికైనా ఇక్కడ ఉపాధికి కొరత ఉండదు. జీవన వ్యయం తక్కువగా ఉండటంతో పేదలు పల్లెను వదిలేందుకు ఇష్టపడరు. అందుకే వీటిని ప్రగతి దిశగా అడుగులు వేయించాలన్న లక్ష్యంతో రూ.కోట్లలో నిధులు కేటాయిస్తోంది. అయినా సమగ్ర అభివృద్ధి కనిపించని పరిస్థితి. ఈ నేపథ్యంలో శిక్షణ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కథనం.

గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఒక్కో మండలంలో మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు, ఉపాధి  క్షేత్రసహాయకులు ఇందులో పాల్గొనేలా చూస్తున్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లా పరిధి సంగారెడ్డి, సిద్దిపేటలో ఇప్పటికే ప్రారంభించారు. సంగారెడ్డిలో ఏడు, సిద్దిపేటలో నాలుగు మండలాల్లో శిక్షణ పూర్తయింది. మెదక్‌, వికారాబాద్‌ జిల్లాల పరిధిలోని మండలాల్లోనూ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

నీటి పొదుపునకు.. ఆర్‌ఆర్‌ఆర్‌

నీటి పొదుపుతోనే భవిష్యత్తు తరాలకు మనుగడ. దీన్ని దృష్టిలో ఉంచుకుని శిక్షణలో భాగంగా ఈ అంశానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. నీటి వినియోగాన్ని తగ్గించడం(రెడ్యూస్‌), పునర్వినియోగం (రీయూజ్‌, భూమిలోకి ఇంకించడం(రీఛార్జి)పై శిక్షణ ఇస్తున్నారు.

పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుకు ప్రణాళిక

గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ కీలకం. ఇది బాగుంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు వీలుంటుంది. శిక్షణలో భాగంగా ఒకరోజు గ్రామ సందర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో సర్వే నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ లోపాలను గుర్తించి పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. దీనికి వీఎస్‌పీ (విలేజ్‌ శానిటేషన్‌ ప్లాన్‌)గా పేరు పెట్టారు.

ప్లాస్టిక్‌ నియంత్రణకు..

ప్లాస్టిక్‌ వినియోగంతో ఆరోగ్యానికి అనర్థమే. పర్యావరణానికి కూడా నష్టం. దీని నిషేధంపై ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రత్యామ్నాయంగా స్టీలును వినియోగించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని శిక్షణలో భాగంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎంపికచేసిన పంచాయతీల్లో స్టీలు బ్యాంకులను కూడా ఏర్పాటు చేయిస్తున్నారు.


అందరూ బాధ్యతగా భావిస్తేనే..
స్వామి, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ జిల్లా సమన్వయకర్త(సంగారెడ్డి)

అందరూ బాధ్యతగా భావిస్తేనే గ్రామాల అభ్యున్నతి సాధ్యం. శిక్షణతో మార్పునకు ప్రయత్నిస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏడు మండలాల్లో పూర్తిచేశాం. మిగతా మండలాల్లోనూ షెడ్యూలు ప్రకారం నిర్వహిస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగుతున్నాం. శౌచాలయానికి ఒక గుంత ఉంటే సరిపోదు, రెండు ఏర్పాటు చేసుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని