logo

రాష్ట్రపతి నిలయంలో తెలుగు సంవత్సరాది

రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలు బుధవారం సంప్రదాయబద్ధంగా జరిగాయి. తొలిసారిగా తెలుగు సంవత్సరాదిని రాష్ట్రపతి నిలయంలో అధికారులు నిర్వహించారు.

Published : 23 Mar 2023 02:56 IST

వేడుకల్లో గవర్నర్‌ తమిళిసై, కిషన్‌రెడ్డి, మహమూద్‌ అలీ, శాంతికుమారి

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, బొల్లారం: రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలు బుధవారం సంప్రదాయబద్ధంగా జరిగాయి. తొలిసారిగా తెలుగు సంవత్సరాదిని రాష్ట్రపతి నిలయంలో అధికారులు నిర్వహించారు. గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌,  కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్‌ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉత్తరమండలం డీసీపీ చందనా దీప్తి ఇతర ఉన్నతాధికారులు ఉత్సవాలను తిలకించారు. పేరిణి కళాకారుడు రాజ్‌కుమార్‌ శిష్యబృందం ప్రత్యేక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. బోనాలు, బతుకమ్మ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంస్కృతిక కార్యక్రమాలకు ముందు మంథనికి చెందిన జ్యోతిష్య పండితుడు పాలెపు రాజేశ్వరశర్మ శోభకృత్‌ నామ సంవత్సర పంచాగ శ్రవణం వినిపించారు. దేశాభివృద్ధి ఈ కొత్త సంవత్సరంలో శోభాయామానంగా ఉంటుందన్నారు. దేశ కీర్తి ప్రతిష్ఠలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి విశేషమైన గుర్తింపు లభిస్తుందని వివరించారు. ప్రధాని మోదీకి ప్రపంచంలో మరింత గుర్తింపు రానుందన్నారు. మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తగ్గి దేశ సంస్కృతి సంప్రదాయాలకు ఆదరణ పెరుగుతుందన్నారు. ప్రపంచంలో యుద్ధాలు పోయి ప్రజలు ఆనందంగా గడుపుతారన్నారు.


వేడుకల నిర్వహణ సంతోషం
-గవర్నర్‌ తమిళిసై

చారిత్రక రాష్ట్రపతి నిలయంలో ఉగాది వేడుకలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉంది. ఈ భవనం కొత్త పర్యాటక కేంద్రంగా మారనుంది. దిల్లీలోని మొగల్‌   గార్డెన్‌లా రాష్ట్రపతి నిలయం ప్రజలను ఆకట్టుకోనుంది. హైదరాబాద్‌ వచ్చే ప్రతి పర్యాటకుడు ఈ ప్రాంతాన్ని సందర్శించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు