logo

పత్రాల సిత్రాలు

చార్మినార్‌ సర్కిల్‌లో వ్యక్తి మరణ ధ్రువపత్రానికి రూ.30 వేల లంచం ఇవ్వాల్సి వచ్చింది. నగరంలో చాలా మీసేవా కేంద్రాలు జనన ధ్రువపత్రానికి రూ.5 వేల లంచం నిర్ణయించాయి.

Published : 23 Mar 2023 03:04 IST

మరణ ధ్రువీకరణకు రూ.30 వేలు.. జననానికి రూ.5 వేలు
50 మీసేవా కేంద్రాలపై బల్దియా క్రిమినల్‌ కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: చార్మినార్‌ సర్కిల్‌లో వ్యక్తి మరణ ధ్రువపత్రానికి రూ.30 వేల లంచం ఇవ్వాల్సి వచ్చింది. నగరంలో చాలా మీసేవా కేంద్రాలు జనన ధ్రువపత్రానికి రూ.5 వేల లంచం నిర్ణయించాయి. గతేడాది మార్చి నుంచి డిసెంబరు వరకు మీసేవా కేంద్రాల్లో ఇలాంటి వసూళ్లు అనేకం జరిగాయి. కొన్నిచోట్ల మరణ ధ్రువపత్రానికి రూ.50 వేలు తీసుకున్నారనే ఫిర్యాదులున్నాయి. జీహెచ్‌ఎంసీ ప్రవేశపెట్టిన ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ విధానాన్ని ఆయా మీసేవా కేంద్రాలు ఇలా దుర్వినియోగం చేసి, వేలాది నకిలీ ధ్రువపత్రాలు సృష్టించిన విషయం విదితమే.. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన పరిశీలనలో 50 మీసేవా కేంద్రాలు అవకతవకలకు పాల్పడినట్లు తేలింది. వాటి నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని బల్దియా కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఆదేశించారు.

ఆ లేఖలకు జవాబు లేదు..

మీసేవా కేంద్రాల్లో జరుగుతున్న తప్పులను మొదట్లోనే గుర్తించామని, వాటిని సరిదిద్దాలని కోరుతూ 2022 జూన్‌ 17న, 2022 డిసెంబరు 21న, 2023 ఫిబ్రవరి 15న మీసేవా కేంద్రాల కమిషనర్‌కు రాసిన లేఖలకు ఇప్పటికీ సమాధానం రాలేదని బల్దియా కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ ఇటీవల జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలోని జనన, మరణాల రిజిస్ట్రార్లు, సబ్‌రిజిస్ట్రార్ల డిజిటల్‌ సంతకాలను మీసేవా కేంద్రాలు దుర్వినియోగం చేశాయన్నారు.

తీరు మార్చుకోని బల్దియా..

జీహెచ్‌ఎంసీ అధికారులు ఇన్‌స్టంట్‌ అప్రూవల్‌ విధానం ద్వారా జారీ అయిన నకిలీ సర్టిఫికెట్లను 22,954గా లెక్క తేల్చారు. కేవలం ఆర్డీవో ప్రొసీడింగ్స్‌తో ముడిపడిన సర్టిఫికెట్లను మాత్రమే పరిశీలించారని, ఆర్డీవో ఉత్తర్వులతో సంబంధం లేని ఏడాదిలోపు జననాలు, మరణాల నమోదులోనూ నకిలీ ధ్రువపత్రాలు మంజూరైనట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.

ఇక్కడే ‘నకిలీ’లలు..

అఫ్జల్‌గంజ్‌, ముషీరాబాద్‌, అంబర్‌పేట, ఆసిఫ్‌నగర్‌, బహదూర్‌పుర, చార్మినార్‌, గోల్కొండ, కాచిగూడ, సైదాబాద్‌, యాకుత్‌పుర, మల్కాజిగిరి, సరూర్‌నగర్‌, నల్లకుంట తదితర పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని 50 మీసేవా కేంద్రాలపై కేసులు నమోదవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని