చెరువును చెరపట్టారు
వందేళ్ల చరిత్ర గల చెరువును కబ్జాదారులు చెరబట్టారు. అందులోని దాదాపు 43.81 ఎకరాలు కొన్నేళ్లుగా కొందరి ఆధీనంలోకి వెళ్లిపోయింది.
కుంట్లూరు పెద్ద చెరువులో 43 ఎకరాలు మాయం
బండరాళ్లతో నింపేస్తున్నా అధికారుల చోద్యం
ఈనాడు-సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, పెద్దఅంబర్‌పేట్, న్యూస్‌టుడే
తటాకంలో వేసిన బండరాళ్లు, మట్టి
వందేళ్ల చరిత్ర గల చెరువును కబ్జాదారులు చెరబట్టారు. అందులోని దాదాపు 43.81 ఎకరాలు కొన్నేళ్లుగా కొందరి ఆధీనంలోకి వెళ్లిపోయింది. తాజాగా చెరువు చుట్టూ ఉన్న ఎఫ్‌టీఎల్ బఫర్‌జోన్‌లోని భూములను బండరాళ్లతో నింపేస్తున్నారు. ఇక్కడ నిర్మాణాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పైభాగం నుంచి చెరువులోకి వచ్చే కాలువను కూడా పెద్ద పెద్ద బండరాళ్లతో పూడ్చివేసే పని మొదలు పెట్టారు. ఇది పూర్తయితే ఈ చెరువులోకి చుక్కనీరు కూడా రాదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగర శివారు పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలోని కుంట్లూరు పెద్ద చెరువు దుస్థితి ఇది. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులు కిమ్మనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
సగం చెరువును పట్టా భూమిగా మార్చేసి..
కుంట్లూరు పెద్ద చెరువు 95.02 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. కొన్నేళ్ల కిందట ఈ చెరువు కింద పెద్దఎత్తున రైతులు సాగు చేసేవారు. మారిన పరిణామాల నేపథ్యంలో సాగు నిల్చిపోయింది. దీంతో చెరువులో మత్స్యకార సంఘం చేపల పెంపకాన్ని మొదలుపెట్టింది. అనేకమంది మత్స్యకారులు దీనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్లుగా అటు సాగునీటి శాఖ.. ఇటు రెవెన్యూ అధికారులు చెరువు గురించి పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారుల కన్నుపడింది. చెరువులో నీటి ప్రవాహం తగ్గిన తరువాత అప్పట్లో కొందరు సాగు చేసుకునేవారు. అధికారులు ఈ వైపు చూడకపోవడంతో ఈ 43.8 ఎకరాలను నెమ్మదిగా తమ పరంచేసుకున్నారు. రెవెన్యూ అధికారులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుని ఈ మొత్తం భూమిని పట్టా భూమిగా మార్చుకున్నారు. దీంతో ఇప్పుడు చెరువు కేవలం 51.21 ఎకరాల విస్తీర్ణానికే పరిమితమైంది. నిబంధనల ప్రకారం చెరువులోకి నీటి ప్రవాహన్ని అడ్డుకునేలా ఎఫ్‌టీఎల్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీలులేదు. కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. బఫర్ జోన్‌లో కూడా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు.
నీటితో కళకళలాడుతున్న పెద్దచెరువు
వరద చేరకుండా కల్వర్టులను మూసేసి..
స్థానికంగా పేరున్న కొందరు పెద్దలు పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో పెద్ద బండరాళ్లు తెచ్చి పూడ్చేస్తున్నారు. ఓ రసాయన కంపెనీలోని మట్టి తీసుకొచ్చి నింపేస్తున్నారు. రసాయనాలతో కూడిన మట్టి వల్ల చెరువులోని చేపలు చచ్చిపోయే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగోల్-పెద్దఅంబర్‌పేట్ రోడ్డులో చెరువులోకి వరదనీరు వెళ్లే కల్వర్టును సైతం బండరాళ్లతో పూడ్చేస్తున్నారు. జేసీబీతో పెద్దఎత్తున పనులు చేపట్టారు. హయత్‌నగర్ పరిధి భాగ్యలత కాలనీ, హైకోర్టు కాలనీ, లెెక్చరర్ కాలనీ మీదుగా హాతీగూడ చెరువు నుంచి కుంట్లూర్ పెద్ద చెరువులోకి వెళ్లే కల్వర్టులను మూసేశారు. వరదనీరు వెళ్లేందుకు వీలులేకుండా చేస్తున్నారు. దీంతో చెరువు ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికైనా రెవెన్యూ, సాగునీటి శాఖ అధికారులు స్పందించి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధులను గుర్తించే హద్దులను ఏర్పాటు చేయాలని స్థానికులు చెబుతున్నారు. ఈ కబ్జా తంతుపై మత్స్యకార సంఘం ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదు. ఈ పరిస్థితిపై చెరువునే నమ్ముకొని జీవనోపాధి పొందుతున్న కుంట్లూర్ గ్రామంలోని మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కేసులు నమోదు చేశాం
- గంగ, సాగునీటి శాఖ ఏఈఈ
ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులతో కలిసి పెద్ద చెరువును పరిశీలించాం. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాం. పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్, బంఫర్ జోన్ పరిధిలో బండరాళ్లు, మట్టిపోస్తే పరిశీలించి తీయిస్తాం. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పైస్థాయి నుంచి వచ్చే ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Gill - Prithvi: తానొక స్టార్ అని భావిస్తాడు.. పృథ్వీ షాపై గిల్ చిన్ననాటి కోచ్ వ్యాఖ్యలు
-
Politics News
Mahanadu: మహానాడు బహిరంగ సభ వద్ద భారీ వర్షం.. తడిసి ముద్దయిన కార్యకర్తలు
-
Movies News
Naresh: ‘మళ్ళీ పెళ్లి’ సక్సెస్.. ‘పవిత్రను జాగ్రత్తగా చూసుకో’ అని ఆయన చివరిగా చెప్పారు: నరేశ్
-
Crime News
Crime: కామారెడ్డి జిల్లాలో దారుణం.. ఆస్తికోసం తమ్ముడిని చంపిన అన్న
-
General News
Top Ten News @ 5PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Crime News
Hyderabad: సికింద్రాబాద్‌లో సినీ ఫక్కీలో దోపిడీ మహారాష్ట్ర ముఠా పనేనా?