logo

హిమాయత్‌సాగర్‌ చెంత ఎకో హిల్‌ పార్కు

జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌... అవుటర్‌ రింగ్‌ రోడ్డు చెంతన కొత్వాల్‌గూడ వద్ద దాదాపు వంద ఎకరాల్లో తలపెట్టిన ఎకో హిల్‌ పార్కు నిర్మాణానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎఫ్‌పీ)లను ఆహ్వానించింది.

Published : 24 Mar 2023 02:44 IST

రూ.200 కోట్లతో 100 ఎకరాల్లో తీర్చిదిద్దేందుకు ప్రణాళిక
దేశంలోనే అతి పెద్ద అండర్‌వాటర్‌ అక్వేరియం

ఆధునిక వసతులతో నిర్మించనున్న ఫుడ్‌ కోర్టు నమూనా

ఈనాడు, హైదరాబాద్‌: జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌... అవుటర్‌ రింగ్‌ రోడ్డు చెంతన కొత్వాల్‌గూడ వద్ద దాదాపు వంద ఎకరాల్లో తలపెట్టిన ఎకో హిల్‌ పార్కు నిర్మాణానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎఫ్‌పీ)లను ఆహ్వానించింది. రూ.200 కోట్ల వ్యయంతో చేపట్టే ఈ ప్రాజెక్టును డిజైన్‌, బిల్ట్‌, ఫైనాన్స్‌, ఆపరేట్‌, ట్రాన్స్‌ఫర్‌(డీబీఎఫ్‌ఓటీ) పద్ధతిలో నిర్మించనున్నారు. 30 ఏళ్ల లీజు గడువు తర్వాత దీన్ని ప్రభుత్వానికి అప్పగించాలనే ఒప్పందంపై పార్కు అభివృద్ధి చేయనున్నారు. ఆర్‌ఎఫ్‌పీ కోసం ఈ నెల 27న తుది గడువుగా హెచ్‌ఎండీఏ నిర్ణయించింది. నగర పర్యాటకానికి ఇది తలమానికం కానుందని అధికారులు చెబుతున్నారు. నగరం నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పర్యాటకుల ఆదరణ పొందుతుందని అధికారులు విశ్వాసంతో ఉన్నారు. ఇప్పటికే అక్కడ సివిల్‌ పనులకు హెచ్‌ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఆర్‌ఎఫ్‌పీ ఖరారైన వెంటనే ఇతర పనులు ప్రారంభించనున్నారు.

ఏమేం ఉండనున్నాయి..

టన్నెల్‌ అక్వేరియం: దేశంలోనే అతి పెద్దదైన టన్నెల్‌ అక్వేరియాన్ని గాజుపలకలతో 360 డిగ్రీల కోణంలో నిర్మించనున్నారు. ఇందులో దాదాపు 200 వరకు చేప జాతులతోపాటు సరీసృపాలను చూడొచ్చు. 4 నుంచి 7 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తారు. 7డీ డోమ్‌ థియేటర్‌ ఇక్కడే రానుంది. ఇందులో వింత గొలిపే జీవులు, చిత్రాలు 7డీలో సహజంగా కన్పించేలా ప్రదర్శిస్తారు.


అండర్‌ వాటర్‌ రెస్టారెంట్‌: నీటి లోపల రెస్టారెంట్‌, ఫుడ్‌ కోర్టులో కూర్చొని తినేలా అండర్‌ వాటర్‌ రెస్టారెంట్‌, ఫుడ్‌ కోర్టును తీర్చిదిద్దనున్నారు.

అడ్వెంచర్‌ పార్కు: ఇక్కడ ఏర్పాటు చేయబోయే అడ్వెంచర్‌ పార్కులో సాహస క్రీడలు, ట్రెక్కింగ్‌ ఏర్పాటు కానున్నాయి.  

రాత్రి బసకు రిసార్ట్‌లు: అడవిలో జంతువుల, పక్షుల అరుపులు వింటూ.. పండు వెన్నెలను చూస్తూ పరవశించిపోయేలా పూర్తి భద్రతా చర్యలతో రిసార్టులు నిర్మించనున్నారు. కుటుంబాలతో వెళ్లి రెండు, మూడు రోజులు గడిపేలా అన్ని మౌలిక వసతులు కల్పించనున్నారు.

అరుదైన పక్షుల పార్కు: ప్రపంచంలోనే అరుదైన పక్షి జాతులతో పక్షుల పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఉష్ణమండల, శీతల మండల పక్షులను పెంచనున్నారు. శీతల మండల పక్షుల కోసం అవసరమైన కృత్రిమ వాతావరణాన్ని సృష్టించనున్నారు. కేవలం పర్యాటక కోణంలో కాకుండా పరిశోధనలకు ఉపయోగపడేలా ఈ ఎకో హిల్‌ పార్కును సిద్ధం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని