logo

మత్తు ముఠాల కొత్త ఎత్తులు

గంజాయి స్మగ్లర్లు వాటి రవాణాకు హైదరాబాద్‌ కేంద్రంగా కొత్త ఎత్తులు వేస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు మూకుమ్మడి దాడులతో ప్రధాన స్మగ్లర్ల ఆట కట్టించారు.

Published : 24 Mar 2023 02:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: గంజాయి స్మగ్లర్లు వాటి రవాణాకు హైదరాబాద్‌ కేంద్రంగా కొత్త ఎత్తులు వేస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసులు మూకుమ్మడి దాడులతో ప్రధాన స్మగ్లర్ల ఆట కట్టించారు. దాంతో మహారాష్ట్ర, కర్ణాటకకు హైదరాబాద్‌ మీదుగా సరఫరాకు గండి పడింది. ఈ నేపథ్‌యంలో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ), విశాఖపట్టణం ఏజెన్సీ ప్రాంతాల్లో లక్షల టన్నుల గంజాయి పేరుకుపోయింది. దీన్ని వేసవి ముగిసే లోపు తరలించేందుకు స్మగ్లర్లు సిద్ధమయ్యారు. ధూల్‌పేట్‌, మంగళ్‌హాట్‌, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, మేడ్చల్‌ తదితర ప్రాంతాల్లోని దళారులతో మంతనాలు జరిపి, ఏపీ నుంచి హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లోని గోదాములకు సరకు తరలిస్తే వాహనానికి రూ.1 - 1.50 లక్షల కిరాయి చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక్కడి గోదాముల నుంచి మరో వాహనంలో మహారాష్ట్రకు సరకు చేరవేస్తారు. దాని కోసం రూ.2 లక్షలు కిరాయి ఇస్తున్నారు.

ఖాళీ బండి.. ఆదాయం దండి

ఏదైనా సరకు దిగుమతి చేశాక లారీలు, డీసీఎంలు వందల కిలోమీటర్లు ఖాళీగా తిరిగి వెళ్లేందుకు మక్కువ చూపరు. కిరాయి దొరికే వరకు వేచిచూస్తారు. ఇందుకు భిన్నంగా ఖాళీగా ప్రయాణిస్తున్న లారీలను పోలీసులు తనిఖీ చేసినప్పుడు అసలు విషయం బయటపడింది.  వాహనాల్లో క్యాబిన్‌, డీజిల్‌ట్యాంకర్‌, ట్రక్కు భాగాల్లో 100-500 కిలోల సరకు నిల్వ చేసేలా ప్రత్యేకంగా బాక్సులు తయారు చేయించి వాటిలో గంజాయి తరలిస్తున్నారు. రాజేంద్రనగర్‌ వద్ద పట్టుబడిన 2 ఖాళీ డీసీఎంల్లో 700 కిలోల గంజాయితో అంతరాష్ట్ర ముఠాలు పట్టుబడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని