logo

మాయా ధరణి

ధరణి పోర్టల్‌ గ్రామాల్లో రైతులను అష్ట కష్టాలకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ను ఆవిష్కరించిన మేడ్చల్‌ జిల్లా మూడుచింతల పల్లి మండలంలోనే ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు.

Updated : 24 Mar 2023 05:13 IST

పట్టాభూముల స్థానంలో ప్రభుత్వ భూములు..
రికార్డులు మార్చాలంటూ బాధితుల ప్రదక్షిణలు
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, శామీర్‌పేట, మహేశ్వరం,  యాచారం, నాగారం:

ధరణి పోర్టల్‌ గ్రామాల్లో రైతులను అష్ట కష్టాలకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి’ పోర్టల్‌ను ఆవిష్కరించిన మేడ్చల్‌ జిల్లా మూడుచింతల పల్లి మండలంలోనే ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదు. ఇదొక్క మండలమే కాదు రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని పలుమండలాల్లో వందలమంది రైతులు, భూముల యజమానులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వంద ఫిర్యాదులొస్తే. వీటిల్లో 65 ధరణి పోర్టల్‌కు సంబంధించినవే ఉంటున్నాయి. ఇప్పటికైనా కలెక్టర్లు స్పందించి సమస్యలు పరిష్కరించాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆరు ఎకరాల భూమి లేదు
-సింగం రాజు, లక్ష్మాపూర్‌, మూడుచింతల పల్లి మండలం

నా పేరు మీద లక్ష్మాపూర్‌లో 12 ఎకరాల భూమి పాత పట్టాదారు పుస్తకాల్లో నమోదైంది. ధరణి పోర్టల్‌లో కేవలం 6 ఎకరాల భూమి నమోదైంది. మరో 6 ఎకరాల నమోదుకు మండల స్థాయి నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు తిరుగుతూనే ఉన్నా. ప్రజావాణిలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.


ఐచ్ఛికం(ఆప్షన్‌) లేదంటున్నారు
-జంగయ్య, ఆరుట్ల, మంచాల మండలం  

పెద్దల నుంచి నాకు సక్రమించిన భూమి ఆరుట్ల సర్వేనంబర్‌ 371, 373లో 6ఎకరాల 9 గుంటలు ఉంది. తాతల కాలం నుంచి సాగు చేస్తున్నాం. పాసు పుస్తకంలో మాత్రం 3 ఎకరాల 5గుంటలు మాత్రమే వచ్చింది. మిగతా 3 ఎకరాల 4 గుంటల కోసం అధికారులను అడిగితే సమాధానం లేదు. ధరణి వెబ్‌సైట్‌లో మార్పులు చేర్పుల ఐచ్ఛికం లేదంటూ చెబుతున్నారు.


భూమిని మింగేసింది
-తిరుపతయ్య, మాడ్గుల

నాకు, నా తమ్ముడికి 5 ఎకరాల 9 గుంటల భూమి వారసత్వంగా వచ్చింది. ఇద్దరం చెరిసగం తీసుకుని సాగు చేసుకుంటున్నాం. అనేక సార్లు బ్యాంకు రుణాలు కూడా తీసుకున్నాం. ధరణి వచ్చాక మా భూమి మాయమైంది. కొత్త పాసు పుస్తకాలు జారీ కాలేదు. అనేక సార్లు అధికారులకు ఆర్జీ పెట్టుకున్నా పట్టించుకోలేదు.


ఇళ్ల స్థలాలకు ఇచ్చినందుకు శిక్ష
-మహమ్మద్‌ సాదత్‌, ఘట్టుపల్లి గ్రామం

ఘట్టుపల్లి సర్వే నంబరు.12లో మా ఐదుగురు అన్నదమ్ములకు 8 ఎకరాల 22 గుంటల పట్టా భూమి ఉంది. 1972లో పేదల ఇళ్ల స్థలాలకు ఉచితంగా 1.10 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చాం. మిగిలిన 7-12 ఎకరాల భూమి ధరణిలో నిషేధిత భూముల జాబితాలో చేరింది. పేదల ఇళ్ల స్థలాల కోసం భూమి ఉచితంగా ఇచ్చినందుకు మాకు అధికారులు శిక్ష వేశారు.


రూ.10 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేదు
-మాదిరెడ్డి నర్సింహారెడ్డి, దమ్మాయిగూడ

కీసర మండలంలో పదేళ్ల కిందట అయిదున్నర ఎకారల భూమి కొన్నా. చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేయాలనుకొని, బ్యాంకు అధికారులను సంప్రదిస్తే రుణం ఇస్తామన్నారు. ధరణి పోర్టల్‌ రాకముందు భూమి నా పేరు మీదే ఉంది. ధరణి వచ్చాక నా పేరు లేదు. పరిశ్రమ ఏర్పాటు కోసం రూ.10 లక్షలు ఖర్చు చేశా. ఆ భూమి నిషేధిత జాబితాలో ఉందని బ్యాంకు అధికారులు రుణం ఇవ్వలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు