logo

మాత్రలిచ్చి.. ధైర్యమిచ్చే వ్యక్తి అనారోగ్యంతో ఆత్మహత్య

ఒంట్లో సుస్తీగా ఉందంటే మాత్రలిచ్చేవాడు.. త్వరగానే తగ్గిపోతుందిలే అని ధైర్యం చెప్పేవాడు.. అనారోగ్య సమస్యలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Published : 24 Mar 2023 02:44 IST

కేసీఆర్‌ అంటే ప్రాణమని చివరి లేఖలో ప్రస్తావన

చెన్నకేశవులు

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: ఒంట్లో సుస్తీగా ఉందంటే మాత్రలిచ్చేవాడు.. త్వరగానే తగ్గిపోతుందిలే అని ధైర్యం చెప్పేవాడు.. అనారోగ్య సమస్యలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నాంపల్లి రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ అయిదోఫేజ్‌కి చెందిన పి.చెన్నకేశవులు(58)కు టెంపుల్‌ బస్టాప్‌ వద్ద 30 ఏళ్లుగా ఫార్మసీ దుకాణం ఉంది. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. ఇతనికి శ్వాసకోస సంబంధిత సమస్యలున్నాయి. 20 రోజులుగా అవి తీవ్రమయ్యాయి. కుటుంబసభ్యులు ధైర్యం చెప్పేవారు. గురువారం ఉదయం కూరగాయలు తీసుకొస్తానని బైకు మీద బయటకు వచ్చాడు. వాహనం తన దుకాణం ముందు నిలిపి పక్క దుకాణం యజమానికి తాళాలిచ్చాడు. ఇంటి నుంచి ఫోన్‌ వస్తే గంటలో వస్తానని చెప్పమన్నాడు. 10 గంటల సమయంలో ఇంటి నుంచి మళ్లీ ఫోన్‌ వస్తే స్పందన లేదు. సందేహం వచ్చి చెన్నకేశవులు సోదరులు చుట్టుపక్కల గాలించసాగారు. హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్‌లో ఎవరో ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి వెళ్లి చూడగా చెన్నకేశవులే అని తేలింది. తన చావుకి ఎవరూ కారణం కాదని, అనారోగ్య సమస్య కారణమని తన చివరి లేఖలో ప్రస్తావించారు. సీఎం కేసీఆర్‌ అంటే ప్రాణమని.. తన మరణ ధ్రువపత్రాన్ని తన భార్యకు ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నాడు. చెన్నకేశవులుకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కుమారుడు రెండు రోజుల కిందటే అమెరికా నుంచి వచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని