logo

సంక్షిప్త వార్తలు

మిద్దె సాగుపై ఈ నెల 26న ఉద్యాన శాఖ శిక్షణ ఇవ్వనుంది. కేవలం రూ.100 చెల్లిస్తే ముత్యాల సాగు నేర్పిస్తామని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు పి.యాదగిరి తెలిపారు.

Published : 25 Mar 2023 01:51 IST

మిద్దెపై ముత్యాల సాగుకు ఉద్యాన శాఖ శిక్షణ రేపు

ఈనాడు, హైదరాబాద్‌: మిద్దె సాగుపై ఈ నెల 26న ఉద్యాన శాఖ శిక్షణ ఇవ్వనుంది. కేవలం రూ.100 చెల్లిస్తే ముత్యాల సాగు నేర్పిస్తామని ఉద్యానశాఖ సహాయ సంచాలకులు పి.యాదగిరి తెలిపారు. సముద్రగర్భంలో ముత్యాలు తయారు కావడానికి 8 నుంచి 10 సంవత్సరాలు పడుతుందని, తాము 18 నెలల్లోనే వాటిని పండించే విధానంలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని ఉద్యాన కేంద్రంలో ఉదయం 10 గంటలకు శిక్షణ ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు ఫోన్‌ నంబరు: 97053 84384 సంప్రదించాలని సూచించారు.


అగ్నివీర్‌ వాయు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: అగ్నివీర్‌ వాయు ఉద్యోగాల భర్తీ కోసం వైమానిక దళం అవివాహితులైన పురుష, మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు మార్చి 31న సాయంత్రం 5గంటలవరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి agnipathvayu.cdac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, మరిన్ని వివరాల కోసం జిల్లా ఉపాధి కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు.


బ్రాహ్మణ కుల గణన చేపట్టాలి

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు బ్రాహ్మణ కుల గణన చేపట్టాలని గ్లోబల్‌ బ్రాహ్మిణ్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గిరిప్రసాద్‌శర్మ కోరారు. శుక్రవారం కాచిగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్‌ 23న రాష్ట్ర సమాఖ్య ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఈ సభ ద్వారా బ్రాహ్మణుల సమస్యలు, డిమాండ్లను ప్రభుత్వం, పార్టీల దృష్టికి తెస్తామన్నారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ బడ్జెట్‌ను రూ.500 కోట్లకు పెంచాలని డిమాండ్‌ చేశారు.


గీతం ప్రవేశ పరీక్షలు 31 నుంచి

బేగంపేట, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్‌ యూనివర్సిటీ జీఏటీ-2023 అడ్మిషన్లకుగాను ఈనెల 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ డి.ఎస్‌.రావు తెలిపారు. శుక్రవారం ఆయన బేగంపేటలోని ఓ హోటల్‌లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు ప్రాంగణాలలోని అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి 48 కేంద్రాలలో కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహించనున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయం జీఏటీ, జేఈఈ మెయిన్‌, ఏపీ, టీఎస్‌ ఎప్సెట్‌లలో అగ్రర్యాంకులు సాధించిన విద్యార్థులతోపాటు అర్హులైనవారికి మెరిట్‌ స్కాలర్‌షిప్‌లు అందజేయన్నుట్లు చెప్పారు.


ఆస్కీలో ‘పినాకిల్‌ ఫెస్ట్‌’ ప్రారంభం

బంజారాహిల్స్‌ న్యూస్‌టుడే: విద్యార్థుల కేరింతలతో మధ్య బంజారాహిల్స్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా (ఆస్కీ)లోని సెంటర్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ (పీజీడీఎం) కేంద్రంలో శుక్రవారం ‘పినాకిల్‌ ఫెస్ట్‌- 23’ పేరిట రెండు రోజులపాటు జరిగే ఇంటర్‌ కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ ఫెస్ట్‌ శుక్రవారం ప్రారంభమైంది. ఆస్కీ డైరెక్టర్‌ జనరల్‌ డా. నిర్మల్యా బాగ్చి మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలన్నారు. నగరంలోని 70 కళాశాలలకు చెందిన 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


ప్రశ్నపత్రాల లీకేజీపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

గోల్నాక, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం చాదర్‌ఘాట్‌ మోతీమార్కెట్‌లోని కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుద్యోగులకు భరోసా, ఉపశమనం కలిగించే బాధ్యత సర్కార్‌పై ఉందన్నారు. నేతలు పులిజాల కృష్ణ, భూషణ్‌భాస్కర్‌, ప్రశాంత్‌నిమ్‌కర్‌, సీహెచ్‌ ప్రదీప్‌గౌడ్‌, ధరణీధర్‌యాదవ్‌ పాల్గొన్నారు.


ఉపాసనకు అరుదైన గౌరవం

ఫిలింనగర్‌: అపోలో హాస్పిటల్‌ ఛైర్మన్‌ డా.ప్రతాప్‌ సి.రెడ్డి మనవరాలు, నటుడు రామ్‌చరణ్‌ భార్య ఉపాసన మోస్ట్‌ ప్రామిసింగ్‌ బిజినెస్‌ లీడర్స్‌ ఆసియా 2022-23 జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమె ట్వీట్‌ చేశారు.


హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో 28న జాబ్‌మేళా

కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే: త్రివిధ దళాలలో పదవీ విరమణ పొందిన, పదవీ విరమణ పొందనున్న అధికారులు, సిబ్బందికి తిరిగి ఉద్యోగావకాశాలు కల్పించేందుకుగాను ఈనెల 28న హకీంపేట్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైమానిక దళం, కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌(సీఐఐ) సౌజన్యంతో ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 37-57 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులని పేర్కొన్నారు. మేళాను హెడ్‌క్వార్టర్‌ ట్రైనింగ్‌ కమాండ్‌ ఎస్‌ఓఏ, ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ పీకే ఘోష్‌ ప్రారంభిస్తారు.


ఇంటర్‌ పరీక్షలు.. 3193 మంది గైర్హాజరు

ఈనాడు,హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని 544 కేంద్రాల్లో రెండో సంవత్సరం పరీక్షలు జరిగాయి. 1,38,517 మంది విద్యార్థులు హాజరుకాగా.. 3193 మంది గైర్హాజరయ్యారని ఇంటర్‌బోర్డు అధికారులు తెలిపారు. అత్యధికంగా 1433మంది రంగారెడ్డి జిల్లాలో పరీక్ష రాయలేదు.


ఎల్బీనగర్‌లో నేటి నుంచి రయ్‌ రయ్‌..

ఈనాడు, హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లో శనివారం సాయంత్రం నుంచి మరో పైవంతెన అందుబాటులోకి రానుంది. వనస్థలిపురం- దిల్‌సుఖ్‌నగర్‌ మార్గంలో ఎల్బీనగర్‌ కూడలి వద్ద నిర్మించిన పైవంతెనను మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఎల్బీనగర్‌ కూడలిని సిగ్నల్‌ ఫ్రీగా మార్చేందుకు  రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ వివరాలను మంత్రి కేటీఆర్‌ శుక్రవారం ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని