logo

ఎప్పటికప్పుడు.. కళేబరాల తొలగింపు

రాజధానిలో జంతువులు, పక్షుల కళేబరాల తొలగింపు ప్రక్రియను జీహెచ్‌ఎంసీ పకడ్బందీగా రూపొందించింది. ఎప్పటికప్పుడు వాటిని తరలించేలా ఏర్పాట్లు చేసింది.

Updated : 25 Mar 2023 03:54 IST

ఫిర్యాదు చేసిన 24 గంటల్లో తరలించకపోతే రూ.10వేల జరిమానా

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో జంతువులు, పక్షుల కళేబరాల తొలగింపు ప్రక్రియను జీహెచ్‌ఎంసీ పకడ్బందీగా రూపొందించింది. ఎప్పటికప్పుడు వాటిని తరలించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయం టెండరు నోటిఫికేషన్‌ను విడుదలచేసింది. పని దక్కించుకున్న గుత్తేదారు నిబంధనల ప్రకారం .. ఫిర్యాదు అందగానే వాహనాలను తీసుకెళ్లి కళేబరాలను తొలగించాలి. ఐదు గంటల జాప్యానికి రూ.500, 24గంటల జాప్యానికి రూ.5వేలు, నిర్లక్ష్యం పునరావృతమైతే రోజుకు రూ.10వేల జరిమానాలు విధించేట్లు జీహెచ్‌ఎంసీ నిబంధలను కఠినతరం చేసింది.

2 మీటర్ల లోతున గుంత..

వీధికుక్కలు, ఆవులు, గేదెలు, పందులు, పిల్లులు, కోతులు, పక్షులు తదితరాలన్నీ కలిపి నగరంలో రోజూ 100కు పైగా చనిపోతుంటాయి. వాటి కళేబరాలు చాలా వరకు ఖాళీ స్థలాల్లో, మైదానాల్లో, చెత్తకుప్పల్లో, నాలాల్లో, చెరువులో కనిపిస్తుంటాయి. రోజుల తరబడి చుట్టుపక్కల ప్రజలు దుర్వాసన ఎదుర్కొంటున్నారు. వర్షాలవేళ ఇలాంటి సమస్యలు మరింత దారుణంగా ఉంటాయి. కొంతకాలంగా జీహెచ్‌ఎంసీకి ఇలాంటి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహానగరపాలిక పశువైద్య విభాగం కఠిన నిబంధనలతో కళేబరాలను తొలగించే ఏర్పాట్లు చేసింది.

* గుత్తేదారు ఎన్జీటీ(జాతీయహరిత ట్రిబ్యునల్‌), పీసీబీ(కాలుష్య నియంత్ర మండలి) నిబంధనల ప్రకారం కళేబరాలను 2మీటర్ల లోతైన గుంతలో పూడ్చాలి. కళేబరంపై కొంతమేర మట్టి, దానిపై ఉప్పును కప్పాలి. పూడ్చిన ప్రాంతానికి కుక్కలు, నక్కలు చేరకుండా, కళేబరాలను వెలికితీయకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత గుత్తేదారుదే. వీటిని ఉల్లంఘించినా జరిమానా తప్పదు. ప్రక్రియ మొత్తం జీహెచ్‌ఎంసీ ఆటోనగర్‌లోని ఖాళీ ప్రదేశంలో జరుగుతుంది.
* చనిపోయిన జంతువులు, పక్షులను తొలగించేందుకు బీఎస్‌-4 వాహనాలను ఉపయోగించాలి. ట్రాలీలోని కళేబరం బయటకు కనిపించకుండా కప్పి ఉంచాలి. వాహనానికి జీపీఎస్‌ తప్పనిసరి.
* జంతువులు, పక్షుల కళేబరాలను ఉడికించి నూనె సేకరించడం నిషేధం. అలాచేస్తే కఠిన చర్యలు తప్పవు.
* తగినంత సిబ్బందితో 24గంటలపాటు అందుబాటులో ఉండాలి. బల్దియా కాల్‌ సెంటరు నంబరు 040 2111 1111, మైజీహెచ్‌ఎంసీ మొబైల్‌ యాప్‌, జీహెచ్‌ఎంసీ ట్విటర్‌, ఫేస్‌బుక్‌ ఖాతాకు, అధికారుల ద్వారా అందే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు