logo

27 కిలోమీటర్లు.. 4 పైవంతెనలు.. 5 అండర్‌పాస్‌లు

44వ జాతీయ రహదారిపై సుచిత్ర, కొంపల్లి, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ కూడళ్లు ప్రమాదకరంగా మారాయి. వీటిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది.

Updated : 25 Mar 2023 04:03 IST

బోయిన్‌పల్లి- కాళ్లకల్‌ మధ్య
జాతీయ రహదారి విస్తరణతో ప్రమాదాల నివారణ

విస్తరణ చేపట్టనున్న సుచిత్ర సర్కిల్‌

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, పేట్‌బషీరాబాద్‌: 44వ జాతీయ రహదారిపై సుచిత్ర, కొంపల్లి, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ కూడళ్లు ప్రమాదకరంగా మారాయి. వీటిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం కార్యాచరణ రూపొందించింది.. జాతీయ రహదారుల సంస్థ అధికారులు, స్థానిక సంస్థలు, పోలీస్‌ యంత్రాంగం సహకారంతో 44వ జాతీయ రహదారిపై నగరంలోని బోయిన్‌పల్లి నుంచి మెదక్‌ జిల్లా కాళ్లకల్‌ వరకు విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా అధికారులు నిర్ణయించారు. కలెక్టరేట్‌లో ఇటీవల కలెక్టర్‌ అమోయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మొత్తం 27 కిలోమీటర్ల దూరాన్ని రూ.933 కోట్ల వ్యయంతో విస్తరిస్తున్నారు. ఇందులో ప్రమాదాలు అధికంగా జరుగుతున్న బ్లాక్‌ స్పాట్లను గుర్తించి, 4 చోట్ల పైవంతెనలు, 5 చోట్ల అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయనున్నారు.

రాత్రి వేళ ప్రాణాలు పోతున్నాయి..

ఈ జాతీయ రహదారిపై మేడ్చల్‌ జిల్లా పరిధిలోని బోయిన్‌పల్లి, డెయిరీ ఫాం, సుచిత్ర, దూలపల్లి, గుండ్లపోచంపల్లి, మేడ్చల్‌ ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్నా ప్రమాదాలు తగ్గడం లేదు.. రాత్రి, తెల్లవారుజామున ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోనే అత్యధికంగా ప్రమాదాలు మేడ్చల్‌, బాలానగర్‌ డివిజన్‌లోనే నమోదవుతుండడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు జాతీయ రహదారి అధికారులతో సంప్రదించి, రహదారి విస్తరణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతమున్న నాలుగు లేన్లకు అదనంగా మరో రెండు నిర్మించనున్నారు. బోయిన్‌పల్లి డెయిరీ ఫాం నుంచి సుచిత్ర కూడలి వరకు, జీడిమెట్ల వద్ద, దూలపల్లి క్రాస్‌రోడ్స్‌ నుంచి కొంపల్లి వరకు, మేడ్చల్‌ శివారు నుంచి పట్టణ సరిహద్దులు పూర్తయ్యేంత వరకు, మరో చోట పైవంతెనలు నిర్మించనున్నారు. సీఎంఆర్‌ జంక్షన్‌, అత్వెల్లితో పాటు మరో మూడు చోట్ల అండర్‌పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. సాధ్యమైనంత వేగంగా పనులు పూర్తిచేయనున్నామని జాతీయ రహదారుల ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సి.శ్రీనివాసరావు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు