logo

పారిశుద్ధ్య పనులు చేస్తుండగా కూలిన గోడ

రంజాన్‌ సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులపై గోడ కూలిన ఘటనలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Published : 25 Mar 2023 02:21 IST

ఒకరి మృతి.. ఇద్దరికి గాయాలు

లంగర్‌హౌస్‌ హాషంనగర్‌లో కూలిన గోడ

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: రంజాన్‌ సందర్భంగా పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులపై గోడ కూలిన ఘటనలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లంగర్‌హౌస్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. లంగర్‌హౌస్‌ హాషంనగర్‌లో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణానికి గోతులుతీసి మట్టిని పక్కన పోశారు. పీవీ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్‌ నంబరు122 గుల్షన్‌కాలనీకి చెందిన కామరాజు అలియాస్‌ కామయ్య(50), అప్పన్న(47) హాషంనగర్‌లోని ఓ గుత్తేదారు వద్ద పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. వీరి స్వస్థలం విజయనగరం జిల్లా కొండగండ్రేడు. వీరితో గుత్తేదారు శుక్రవారం హాషంనగర్‌లో పనులు చేయిస్తున్నారు. రంజాన్‌ మొదటి శుక్రవారం నేపథ్యంలో మసీదులు, బస్తీల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు. మజ్లిస్‌ నేత మహబూబ్‌ పాషా(40) దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చెత్త తొలగిస్తుండగా నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ ఒక్కసారిగా కూలి కార్మికులపై పడింది. కామరాజు, అప్పన్నతో పాటు పనులు పర్యవేక్షిస్తున్న మజ్లిస్‌ నేత గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానికులు నానల్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ కామరాజు మృతి చెందాడు. అప్పన్నకు తీవ్రగాయాలు కాగా, మహబూబ్‌కు వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. నిర్లక్ష్యంగా పనులు చేపట్టిన ఇంటి యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని