logo

పనులు అసంపూర్ణం.. ఆటలకు ఆటంకం

తాండూరులో రూ.4కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే ఆడిటోరియం, ఇండోర్‌ స్టేడియం నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. రెండేళ్ల కిందటే చేపట్టినా పూర్తి కావడంలేదు.

Updated : 25 Mar 2023 04:00 IST

ముందుకు సాగని ఆడిటోరియం, ఇండోర్‌ స్టేడియం 

ఇండోర్‌ స్టేడియం ఇలా..

న్యూస్‌టుడే, తాండూరు, పరిగి: తాండూరులో రూ.4కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టే ఆడిటోరియం, ఇండోర్‌ స్టేడియం నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. రెండేళ్ల కిందటే చేపట్టినా పూర్తి కావడంలేదు. ఏడాదిలోగానే ప్రారంభానికి నోచుకుంటాయని ఇంజినీర్లు అంచనా వేశారు. సగంలోనే ఆగిపోవడంతో ఔత్సాహిక క్రీడాకారులకు నిరుత్సాహం తప్పడంలేదు.

అవసరం ఎందుకంటే..: తాండూరు నియోజక వర్గంలో అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించేందుకు ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తాండూరు నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే మార్గంలోని అంతారం గుట్టపై ఒకేసారి 1000 మందితో సమావేశం నిర్వహించేందుకు వీలుగా భవనాన్ని నిర్మించేందుకు పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజినీర్లు డిజైన్‌ను రూపొందించారు. ప్రభుత్వం ఇందు కోసం ఎకరం స్థలాన్ని కేటాయించి గుత్తేదారుకు అప్పగించింది. ఈమేరకు ఇంజినీర్లు మార్క్‌ ఔట్‌ ఇవ్వగానే ఏడాది కిందట పనులు ప్రారంభించారు. మళ్లీ ముందుకు సాగలేదు.

రెవెన్యూ కార్యాలయంగా మార్చారు: తాండూరులో 2002లో రూ.50లక్షల వ్యయంతో మినీ స్టేడియంను నిర్మించారు. ఇక్కడే మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయి క్రీడా పోటీలను స్పోర్ట్స్‌ అథారిటీ నిర్వహించింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం వికారాబాద్‌ జిల్లాలో రెండో డివిజన్‌ కేంద్రంగా ప్రభుత్వం తాండూరును ఎంపిక చేసింది. ఇందుకోసం మినీ స్టేడియంనే రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంగా మార్చేసింది. దీంతో ఆటలు ఆడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రూ.2కోట్ల వ్యయంతో అంతారం గుట్ట మీద 1.5 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఇక్కడ నిర్మించే స్టేడియంలో రెండు బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, క్యారమ్‌, వాలీబాల్‌, కబడ్డీ వంటి క్రీడలు ఆడేందుకు వీలుగా స్టేడియం నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రారంభంలో వేగంగా జరిన పనులు ఏడాది నుంచి ఆగిపోయాయి.  


జూన్‌లోగా పూర్తి చేస్తాం

- వెంకట్‌ రావు, పంచాయతీ రాజ్‌ శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, తాండూరు

అసంపూర్ణంగా ఉన్న ఆడిటోరియం పనులను జూన్‌లోగా పూర్తి చేస్తాం. గుత్తేదారుకు పెండింగులో ఉన్న బిల్లులు ఇటీవలే మంజూరయ్యాయి. పనులను పునఃప్రారంభించాలని ఆదేశించాం.  


గుత్తేదారును ఆదేశించాం

- శ్రీనివాస్‌, సహాయ ఇంజినీరు, టీఎస్‌ ఈడబ్ల్యూఐడీసీ, తాండూరు

ఆగిపోయిన ఇండోర్‌ స్టేడియం పనులను వెంటనే ప్రారంభించాలని గుత్తేదారును ఆదేశించాం. త్వరలోనే పనులు ప్రారంభం అవుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని