logo

అక్రమ కనెక్షన్లు దండి.. ఖజానాకు గండి

తాండూరులో నిబంధనలకు విరుద్ధంగా ఒక కనెక్షన్‌ ద్వారా రెండు మూడు గనులు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారులు నెలనెలా బిల్లు వసూలుతో సరిపెడుతున్నారు.

Updated : 26 Mar 2023 04:38 IST

గనుల్లో యథేచ్ఛగా విద్యుత్‌ వాడకం  
పట్టించుకోని యంత్రాంగం

తాండూరు పట్టణానికి చెందిన ఒకరు ఓగీపూర్‌లోని పట్టా భూమి నాపరాయి గనికి ట్రాన్స్‌కో నుంచి విద్యుత్‌ కనెక్షన్‌ పొందారు. దానినుంచే పక్కనున్న మరో రెండు గనులకు కనెక్షన్‌ ఇచ్చారు. ఇలా ఒకే కనెక్షన్‌తో మూడు గనుల్ని తవ్వేస్తున్నారు.  

మల్కాపూర్‌లోని ప్రభుత్వ భూమిలో ఒకరు గని కార్యకలాపాలు నిర్వహించారు. తవ్వకాలు పూర్తవడంతో సమీపంలోని మరో ఇద్దరి గనులకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు. అందుకు నెలకు రూ.10వేలు అద్దె వసూలు చేస్తున్నారు. గనుల్లో విద్యుత్‌ అక్రమ కనెక్షన్లకు ఇవి చిన్న ఉదాహరణలు మాత్రమే.  

అతుకులతో తీగలు, ఫ్యూజులు ఇలా..

న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ: తాండూరులో నిబంధనలకు విరుద్ధంగా ఒక కనెక్షన్‌ ద్వారా రెండు మూడు గనులు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌కో అధికారులు నెలనెలా బిల్లు వసూలుతో సరిపెడుతున్నారు. నాపరాయి తరలింపులో సర్కారు ఆదాయానికి గండికొడుతున్నా పట్టించుకోవడం లేదని బహిరంగ విమర్శలొస్తున్నాయి.

ఖనిజ సంపద దోచేస్తున్నారు

అనుమతుల్లేకుండా విద్యుత్‌ అక్రమ కనెక్షన్లతో నిక్షేపాల తవ్వకం యథేచ్ఛగా సాగిపోతోంది. వెరసి ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం  243 గనులకు అనుమతులు, విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా 150కి పైగానే ఉన్నట్లు అంచనా  జిల్లాలోని 20 మండలాల్లో 5,496 ఎకరాల్లో ఖనిజ సంపదతో కూడిన నేలలు ఉన్నాయి. వీటిని తవ్వడానికి పర్యావరణ, అటవీ, రెవెన్యూ ఇలా పలు శాఖల అనుమతులు తప్పనిసరి. అవేమీ లేకుండానే దోచేస్తున్నారు.

ట్రాన్స్‌కో అధికారులు గృహ వినియోగదారులకు నిబంధనలు పక్కాగా అమలు చేస్తుండగా నాపరాయి గనులకు అక్రమ కనెక్షన్‌లతో విద్యుత్‌ వినియోగిస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శలొస్తున్నాయి.


పరిశీలించి చర్యలు తీసుకుంటాం:
వెంకటనాయుడు, ఏఈ, ట్రాన్స్‌కో, తాండూరు.

నాపరాయి గనుల్లో ఒక కనెక్షన్‌తో ఒకే గనికి విద్యుత్తు వాడాలి. పక్కనున్న గనులకు విద్యుత్‌ సరఫరా చేస్తే కనెక్షన్‌ తొలగించి పదింతల అపరాధ రుసుం వసూలు చేస్తాం. పరిశీలించి అక్రమంగా కనెక్షన్లను తొలగింపజేస్తాం. నిబంధనల ప్రకారం అన్నిదస్త్రాలు సమర్పించి గనులకు విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని