logo

రుణ పరిమితి నిర్ధారణ.. కావాలి కార్యాచరణ

రైతులకు పంట రుణాలను ఏటా బ్యాంకర్లు ఇస్తుంటారు. వీటిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ టెస్కాబ్‌) ఖరారు చేస్తుంది.

Published : 26 Mar 2023 00:44 IST

అత్యధికంగా చెరకు పంటకు రూ.80 వేలు

చెరకు పంట

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు: రైతులకు పంట రుణాలను ఏటా బ్యాంకర్లు ఇస్తుంటారు. వీటిని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు (స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ టెస్కాబ్‌) ఖరారు చేస్తుంది. 2023-24 సంవత్సరానికి 123 పంటలకు రుణ పరిమితిని నిర్ధారించారు. గత సీజన్‌ కంటే రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు పెంచుతూ ఖరారు చేసిన రుణ పరిమితి అమలుకు బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)కి నివేదిక పంపించింది. దీని ఆధారంగా రానున్న వానాకాలం సీజన్‌లో వ్యవసాయ పంట రుణాలను బ్యాంకర్లు అమలు చేయనున్నారు.


ఆశించిన మద్దతు ఏదీ..

ఏటా రుణ పరిమితి పెంపు కనిపిస్తున్నా, అమల్లో మాత్రం జిల్లా రైతులకు ఆశించినంత మద్దతు లభించడం లేదు. బ్యాంకర్లు జిల్లా కలెక్టర్ల సమావేశంలో జరిగిన ఒప్పందాలను సైతం విస్మరించి రైతులకు ఇచ్చే రుణాల్లో కోత పెడుతున్నాయి. ఈసారైనా ‘టెస్కాబ్‌’ సూచనలు పూర్తి స్థాయిలో అమలు చేస్తారా? లేదా? అనేది బ్యాంకర్లపై ఆధారపడి ఉందని పలువురు చెబుతున్నారు.

* నాలుగేళ్లుగా జిల్లాలో ప్రాజెక్టుల పరిధిలో సాగు పెరగటం, కూలీల కొరత, పెరిగిన పెట్టుబడుల కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెంచిన పరిమితికి అనుగుణంగా ఇస్తే ఊరట కలుగుతుందని అన్నదాతలు సూచిస్తున్నారు.


జిల్లాలో 2.32 లక్షల మంది

జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటున్న రైతులు 2.23 లక్షల మంది వరకు ఉన్నారు. దాదాపుగా రూ.1,234 కోట్ల వరకు తీసుకుంటున్నారు. వాటిని రెన్యువల్‌ చేసే సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా పెంచిన రుణ పరిమితిని బ్యాంకులు వర్తింప చేయాలి.


పెంచిన మొత్తాలు

* 2022- 23 సంవత్సరంతో పోల్చితే 2023- 24 సంవత్సరానికి ప్రధాన పంటలైన వరికి రూ.40 వేల నుంచి 45 వేలకు రుణ పరిమితి పెంచారు. అలాగే పత్తికి రూ.38,000- 45,000, మిరప రూ. 75,000- 80,000, మొక్కజొన్న రూ.- 30,000- 34,000, వేరుసెనగ రూ. 28,000- 30,000, చెరకు రూ.75,000 - 80,000,  ఉల్లి రూ.37,000 - 45,000, ఉద్యాన రూ.- 30,000- 31,000గా నిర్ణయించారు. అత్యధికంగా చెరుకు పంటకు రూ.80 వేలు పెంచారు.


టెస్కాబ్‌ మార్గదర్శకాలే ముఖ్యం
-  రాంబాబు, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌

రుణపరిమితి పెంపు టెస్కాబ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకర్ల సమితి సమావేశం కావాలి. అందులో నిర్ణయం తీసుకున్న తర్వాతే అమల్లోకి వస్తుంది. అప్పటివరకు వేచి చూడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని