logo

రైతులకు పక్కాగా పరిహారం చెల్లింపు: సబిత

ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 26 Mar 2023 00:44 IST

ఉత్తమ సర్పంచులను సన్మానిస్తున్న మంత్రి సబిత, జడ్పీ అధ్యక్షురాలు సునీత,
కలెక్టర్‌ నారాయణరెడ్డి, ప్రజా ప్రతినిధులు

వికారాబాద్‌, న్యూస్‌టుడే: ఇటీవల కురిసిన వడగళ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ.10 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వెంటనే రైతుల వివరాలు సేకరించి పకడ్బందీగా పరిహారం అందించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితారెడ్డి అన్నారు . తెలిపారు. శనివారం డీఆర్‌సీ భవనంలో జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని, జొన్న, నూనె గింజల సాగు పెరిగేలా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొత్త కలెక్టర్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుండటంతో చాలా వరకు సమస్యలు తీరిపోతున్నాయన్నారు.  


సీపీఆర్‌తో నిండు ప్రాణాన్ని రక్షించాలి

ఇటీవల వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది గుండెపోటుతో మృతి చెందుతున్నారని, వారికి సకాలంలో ప్రథమ చికిత్స సీపీఆర్‌ నిర్వహించడం ద్వారా ప్రాణాన్ని రక్షించవచ్చని మంత్రి సబితారెడ్డి అన్నారు. సీపీఆర్‌ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు.


ఉత్తమ గ్రామాలకు రూ.10 లక్షల నిధులు

2023 సంవత్సరంలో ఉత్తమ గ్రామాలుగా జిల్లాలోని 27 గ్రామ పంచాయతీలు ఎంపికయ్యాయని, వీటి అభివృద్ధికి రూ.10 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. ఉత్తమ గ్రామాల సర్పంచులను సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో వికారాబాద్‌, పరిగి, చేవెళ్ల ఎమ్మెల్యేలు ఆనంద్‌, మహేష్‌రెడ్డి, యాదయ్య, జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీసీసీబీ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, డీసీఎంఎస్‌ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు సుశీల్‌కుమార్‌గౌడ్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని