logo

బియ్యం నిల్వలకు రక్షణేది!

హాస్టళ్లకు పంపిణీ చేసే బియ్యం నాసిరకంగా ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది.

Published : 26 Mar 2023 02:04 IST

చీకటి గదులు.. అపరిశుభ్ర వాతావరణం
హాస్టళ్లలో పౌరసరఫరాల శాఖ తనిఖీలు

జూబ్లీహిల్స్‌ ప్రభుత్వ బీసీ కళాశాల బాలికల హాస్టల్‌లో స్టాక్‌ తనిఖీలో అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: హాస్టళ్లకు పంపిణీ చేసే బియ్యం నాసిరకంగా ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. బృందాలుగా హాస్టళ్లల్లో తనిఖీలు చేస్తోంది. నగరంలోని 164 హాస్టళ్లలో తనిఖీలు చేస్తూ ఫిర్యాదులకు గల కారణాలను విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్‌ పౌరసరఫరాలశాఖ అధికారి (డీఎస్‌వో), డీఎంలు సైతం నేరుగా హాస్టళ్లను సందర్శిస్తున్నారు. మధ్యాహ్నం వరకూ హాస్టల్‌లోనే ఉండి భోజనం చేసి.. నాణ్యతను పరిశీలిస్తున్నారు. జిల్లాలోని హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలకు ప్రతి నెలా సగటున 370 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం పంపిణీ అవుతోంది. బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం, వంటశాలల్లో పరిశుభ్రత లేకపోవడంతో ఫిర్యాదులు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొత్తగా సరఫరా అయిన బియ్యాన్ని వినియోగిస్తూ.. పాత వాటిని పక్కన పెడుతుండటంతో ఆ బియ్యం పాడవుతోందని గుర్తించారు. నిల్వలు నిండుకున్న సమయంలో పాత స్టాక్‌ను వినియోగిస్తుండటంతో ఆహారం చెడిపోతోందని తేల్చారు. బియ్యం నిల్వల నిర్వహణపై హాస్టల్‌ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్నారు. సెలవుల్లో, హాస్టల్‌ మూసి ఉన్న సమయాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  

జూబ్లీహిల్స్‌లోని రెసిడెన్షియల్‌ పాఠశాలలో భోజనం చేస్తున్న చిన్నారులు


బిఫోర్‌ మెథడ్‌ విస్మరణ.. : రమేశ్‌, డీఎస్‌వో

ఇప్పటి వరకు 70 హాస్టళ్లలో తనిఖీలు పూర్తయ్యాయి. ఎక్కువ చోట్ల బియ్యాన్ని సరిగా నిల్వ చేయకపోవడమే సమస్యకు కారణమని తేలింది. చీకటి గదుల్లో ఉంచడం, పరిశుభ్రత పాటించడం లేదని గుర్తించి వెంటిలేషన్‌ ఉన్న ప్రాంతంలో ఉంచాలని సూచించాం. బియ్యం రాగానే పరిశీలించి.. బాగాలేకపోతే మూడు రోజుల్లో తిప్పి పంపాలి. అప్పుడు ఏ మిల్లు నుంచి వచ్చిందో గుర్తించి వారికి సమాచారమిస్తాం. కొందరు హాస్టల్‌ నిర్వాహకులు ఆరు నెలల తర్వాత ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా ఫిర్యాదులొచ్చిన చోట పరిశీలించగా.. బిఫోర్‌ మెథడ్‌ (మొదట వచ్చిన స్టాక్‌ను వండేయడం) విస్మరిస్తున్నారని తేలింది. వంటకు వాడే నీటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నేను స్వయంగా అబిడ్స్‌, ట్రూప్‌ బజార్‌లో ఉన్న రెండు హాస్టళ్లకు వెళ్లి ఆహార నాణ్యతను పరిశీలించా. మా సిబ్బంది సైతం హాస్టళ్లకు వెళ్లి విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యతపై ఆరా తీస్తున్నారు.

* జిల్లాలో హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ పాఠశాలలు - 164
* ప్రతి నెలా పంపిణీ చేసే బియ్యం - 370 మెట్రిక్‌ టన్నులు
* హాస్టళ్లలో ఉండే విద్యార్థులు - 44,270

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని