నిమ్మగడ్డ శేషగిరి ‘ఊహలకందని మొరాకో’ పుస్తకావిష్కరణ

యూకేలో ప్రముఖ సైకియాట్రిస్టు డా. నిమ్మగడ్డ శేషగిరి రావు రాసిన ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం ‘ఊహలకందని మొరాకో’ పుస్తక ఆవిష్కరణ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది.

Updated : 26 Mar 2023 15:42 IST

హైదరాబాద్‌ : యూకేలో ప్రముఖ సైకియాట్రిస్టు డా. నిమ్మగడ్డ శేషగిరి రావు రాసిన ఆంగ్ల రచనకు తెలుగు అనువాదం ‘ఊహలకందని మొరాకో’ పుస్తక ఆవిష్కరణ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. దాసరి అమరేంద్ర ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొన్నారు. అక్కడి పరిస్థితులను వివరించిన తీరును కొనియాడారు. రచయిత్రి నంబూరి పరిపూర్ణ రాసిన ‘ఆలంబన’ పుస్తకావిష్కరణ కూడా ఇదే కార్యక్రమంలో జరిగింది.

అదొక అభిరుచిగా ప్రారంభమైంది..

ఈ కార్యక్రమంలో నిమ్మగడ్డ శేషగిరి మాట్లాడుతూ..‘యాత్రలపై పుస్తకం రాద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు. అదొక అభిరుచిగా ప్రారంభమైంది. అది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఏడాదికి నాలుగైదు దేశాల్లో పర్యటిస్తాను. అక్కడ కొత్త విషయాల గురించి తెలుసుకుంటాను. అక్కడి వాళ్లతో ఇంటరాక్ట్‌ అవుతాను. యాత్రలు అంటే.. ప్రపంచాన్ని మీరు చూడటం కాదు.. ప్రపంచం అనే అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవడం. మనం ఎన్నో విషయాలకు టైమ్‌ కేటాయిస్తాం. అయితే.. మనకు మనం టైమ్‌ కేటాయించుకోం. నేను ట్రావెల్‌ అనే మాధ్యమం ద్వారా నాకు నేను టైమ్‌ కేటాయించుకున్నాను. ఇక్కడే ఒక్కడినే ట్రావెల్‌ చేయడమనేది ప్రారంభమైంది. అలా ప్రపంచంలోకి వెళ్లి మనం కలిసిపోవాలి. ప్రపంచం ముందు మనం ఎంత చిన్నవాళ్లమో అప్పుడే తెలుస్తుంది’ అని వివరించారు.

కాకినాడలో మెడిసిన్‌ చదివి ఇంగ్లాండ్‌లో ఫోరెన్సిక్‌ సైకియాట్రిస్ట్‌గా స్థిరపడిన నిమ్మగడ్డ శేషగిరికి యాత్రలపై మక్కువ ఎక్కువ. గత 25 ఏళ్లుగా ఆయన ప్రపంచమంతా విస్తారంగా పర్యటించారు. తెలుగు వారికి అంతగా పరిచయం లేని మొరాకో దేశంలో నెల రోజులు తిరిగారాయన. ఆ అనుభవాలను ఆంగ్లంలో రాశారు. స్వయంగా యాత్రా రచయిత అయిన దాసరి అమరేంద్రకు శేషగిరి చేసిన ప్రయాణాలంటే ఎంతో ఇష్టం. ఆ అనుభవాలను తెలుగువారికి చేర్చాలన్న ప్రయత్నంతో వాటిని అనువదించి ‘ఊహలకందని మొరాకో’ రూపంలో తీసుకువచ్చారు.

వివిధ దేశాల్లో నిమ్మగడ్డ శేషగిరి అనుభవాలు కథనాలుగా.. ప్రముఖ తెలుగు మాసపత్రిక ‘మిసిమి’లో ధారావాహికలుగా ప్రచురితమవుతున్నాయి. భవిష్యత్‌తో ట్రావెలాగ్‌పై మరిన్ని పుస్తకాలు అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని