logo

వెన్నెముక సమస్య నయం చేస్తామని రూ.7.8 లక్షలు స్వాహా

వెన్నెముక సమస్యకు మందులు ఇచ్చి నయం చేస్తామని ఓ మహిళను నమ్మించి దాదాపు రూ.7.8లక్షలకు కొట్టేసిన ఘటన ఇది.

Published : 27 Mar 2023 00:37 IST

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: వెన్నెముక సమస్యకు మందులు ఇచ్చి నయం చేస్తామని ఓ మహిళను నమ్మించి దాదాపు రూ.7.8లక్షలకు కొట్టేసిన ఘటన ఇది. బోయిన్‌పల్లికి చెందిన మహిళ(37) వెన్నెముక సమస్యతో సరిగా నడవలేని స్థితిలో ఉన్నారు. విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి పరిచయం చేసుకొని తన చెల్లెలికి ఇదే సమస్య ఉంటే ఓ వైద్యుడి చెంత మందులతో తగ్గిందని, అవసరమైతే ఫోన్‌ చేయమని కార్డు ఇచ్చి వెళ్లాడు. మరుసటి రోజు ఆమె వ్యక్తికి ఫోన్‌ చేసి క్లినిక్‌కు వస్తానని చెప్పగా, వైద్యుడు ముంబయినుంచి వస్తాడని, ఇంటికి వచ్చి చూస్తారని తెలిపాడు. జనవరి 31న ఓ వైద్యుడు, సహాయకుడితో ఆమె ఇంటికి వచ్చి వెన్నెముక వద్ద నీరు తొలగించారు. అందుకు రూ.2లక్షలు వసూలు చేశారు. మరుసటిరోజు వైద్యుడు ఫోన్‌చేసి మెడిసిన్‌ తీసుకోవాలని, అవి  ఖైరతాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎదుట ఓ మందుల షాపులో దొరుకుతాయని చెప్పాడు. ఫిబ్రవరి 3న ఆమె అక్కడికి వెళ్లి వైద్యుడికి ఫోన్‌ చేయగా, అక్కడున్నవారితో మాట్లాడి మందులు చెప్పాడు. రూ.1.20లక్షలు నగదు, మరుసటి రోజు రూ.80వేలు ఫోన్‌పే ద్వారా చెల్లించి ఆమె మందులు తీసుకున్నారు. అదేనెల 6న ఫోన్‌ చేసి మరిన్ని మందులు తీసుకోవాలని ఒత్తిడి చేయగా రూ.3.80 లక్షలు నగదు చెల్లించి తీసుకున్నారు. రెండోసారి తీసుకున్న మందులు వాడాక నొప్పి అధికం కావడంతో వైద్యుడిని ప్రశ్నించగా, సహాయకుడిని పంపి మూత్రం శాంపిల్స్‌ తీసుకున్నారు. నెల నుంచి ఫోన్లకు స్పందించకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి సైఫాబాద్‌ పోలీసులను ఆశ్రయించారు. మందుల దుకాణం సైతం ఖాళీ చేస్తున్నట్లు తెలిసిందన్నారు. ఇన్‌స్పెక్టర్‌ సత్తయ్యను సంప్రదించగా ఫిర్యాదు వచ్చిందని, విచారణ జరుగుతోందని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని