logo

తండ్రి పంపించాడని పిల్లల్ని నమ్మించి.. ఇల్లు గుల్ల

తండ్రి పంపాడని పిల్లలను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడు బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.

Published : 27 Mar 2023 00:37 IST

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: తండ్రి పంపాడని పిల్లలను నమ్మించి ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడు బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదు ఎత్తుకెళ్లిన ఘటన బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లో నివసించే కారు డ్రైవర్‌ బి.నాగార్జున దంపతులు శనివారం బయటకు వెళ్లారు. మధ్యాహ్నం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన వారి పిల్లలు పృథ్విరాజ్‌(11), చందనశ్రీ(7) తాళం తీసుకొని ఇంట్లోకి వెళ్లగా, అదే సమయంలో వచ్చిన ఒక వ్యక్తి తలుపుతట్టాడు. తనను నాగార్జున పంపాడని, అల్మారాలోని దుస్తులు తీసుకురమ్మారని చెప్పాడు. పృథ్వికి రూ.10 ఇచ్చి బిస్కెట్‌ ప్యాకెట్‌ కొనుక్కోమనడంతో దుకాణం వద్దకు వెళ్లగా, ఆగంతుకుడు అల్మారాలోని తులం చెవిపోగులు, 13 లక్ష్మి దేవి బంగారు నాణేలు, తొమ్మిది తులాల వెండి పట్టీలు, రూ.55వేల నగదు తీసుకొని వెళ్లిపోయాడు. తిరిగి వచ్చిన పృధ్వీ అల్మారా తెరిచి ఉండటాన్ని గమనించి స్థానికుల ద్వారా ఫోన్‌లో తండ్రికి చెప్పారు. ఇంటికి వచ్చిన నాగార్జున పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు