logo

HYD Metro: మెట్రోరైల్‌ నెట్‌వర్క్‌ జాబితాలో మూడో స్థానానికి పడిపోయిన హైదరాబాద్‌

దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం మెట్రోరైలు నెట్‌వర్క్‌ కల్గిన నగరాల్లో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది.

Updated : 27 Mar 2023 08:08 IST

విస్తరణలో మిగతా నగరాల దూకుడు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం మెట్రోరైలు నెట్‌వర్క్‌ కల్గిన నగరాల్లో ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్‌.. ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది. మెట్రో విస్తరణపై సంవత్సరాల తరబడి ప్రకటనలే తప్ప క్షేత్రస్థాయిలో పనులు మొదలు కాకపోవడం.. ఇతర మెట్రో నగరాలు ప్రాధాన్యం ఇచ్చి పెద్ద ఎత్తున విస్తరణ పనులు చేపట్టడంతో నెట్‌వర్క్‌ పరంగా హైదరాబాద్‌ మెట్రో వెనకబడింది. బెంగళూరులో ప్రధాని మోదీ శనివారం కొత్తగా 13.71 కి.మీ. మార్గాన్ని ప్రారంభించారు. దీంతో బెంగళూరు నమ్మ మెట్రో నెట్‌వర్క్‌ 70 కి.మీ.కి చేరింది.

ప్రణాళికలు పట్టాలెక్కక..

ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి, ఆధునిక ప్రజారవాణా సదుపాయాలు పెంపొందించేందుకు నగరాల్లో మెట్రోరైలును వేగంగా విస్తరిస్తున్నారు. మొదటి రెండు స్థానాల్లో ఉన్న దిల్లీ, బెంగళూరు నగరాల్లో భారీ ఎత్తున విస్తరిస్తున్నాయి. పనులన్నీ వేర్వేరు దశల్లో ఉన్నాయి. చెన్నైలోనూ భారీగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. త్వరలో హైదరాబాద్‌ మూడు నుంచి నాలుగో స్థానానికి పడిపోనుంది. ఆ స్థాయిలో ఆయా నగరాల్లో మెట్రో విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ మూడు నగరాల్లో మెట్రో ప్రాజెక్ట్‌లకు కేంద్రం పెద్ద ఎత్తున ఆర్థిక తోడ్పాటు అందిస్తుండటంతో పనులు చకచకా సాగుతున్నాయి. రాష్ట్రాలు సైతం అంతే స్థాయిలో నిధులు వెచ్చిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీటిని నిర్మిస్తున్నాయి. హైదరాబాద్‌ మెట్రోకి సంబంధించి మొదటిదశ పూర్తిగా పీపీపీ విధానంలో చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక భాగస్వామ్యం ఇందులో నామమాత్రమే. రెండో దశకు సంబంధించి 62 కి.మీ. ప్రణాళికలు ఉన్నాయి. వీటిలో 31 కి.మీ. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ వరకు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టేందుకు ముందుకొచ్చింది. పనులకు శంకుస్థాపన చేశారు. నిధులు మంజూరు చేస్తే పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మిగతా 31 కి.మీ. బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌, నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు పనులకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అక్కడి నుంచి స్పందన లేదు. ఇలా రెండోదశకు ఇటు రాష్ట్రం, అటు కేంద్రం నిధులు సమకూర్చకపోవడంతో పనులు పట్టాలెక్కలేదు. వీటి డీపీఆర్‌లు సిద్ధమై మూడేళ్లు అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని