logo

క్షేత్రస్థాయి సిబ్బంది.. మాయాజలం

గ్రేటర్‌లో పలు డివిజన్లలో నీటి మీటర్ల వినియోగంలో మాయాజాలం నడుస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది అండదండలతో కొందరు అక్రమాలకు తెరతీశారు.

Published : 27 Mar 2023 01:33 IST

వినియోగించిన నీరు లెక్కల్లోకి రాకుండా సహకారం
సరఫరా ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మీటర్ల తొలగింపు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో పలు డివిజన్లలో నీటి మీటర్ల వినియోగంలో మాయాజాలం నడుస్తోంది. క్షేత్రస్థాయి సిబ్బంది అండదండలతో కొందరు అక్రమాలకు తెరతీశారు. మీటర్లు ఏర్పాటు చేసినట్లు రికార్డుల్లో చూపి.. ఉచిత నీటి పథకానికి అర్హత సాధించి.. తర్వాత వాటిని తొలగించడం లేదా ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. ఉచిత నీటి సరఫరా పోను అదనంగా వాడుకునే నీటికి బిల్లులు చెల్లించకుండా తప్పించుకోవటానికి ఈ అడ్డదారి ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చాలా డివిజన్లలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.

60-70 శాతమే..

గ్రేటర్‌ వ్యాప్తంగా ఉచిత నీటి సరఫరా పథకం అమలవుతున్న విషయం తెలిసిందే. మొత్తం 12 లక్షల నల్లాల్లో ఇప్పటికే 60-70 శాతం మంది ఉచిత నీటి కోసం ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. ఇలాంటి వారికి నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచిత సరఫరా జరుగుతోంది. అంతకు మించితే.. అదనంగా వాడుకున్న నీటికి బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇక్కడే కొందరు అతితెలివి ప్రదర్శిస్తున్నారు. జలమండలి సరఫరా చేసే ఉచిత నీటిని వాడుకోవడమే కాకుండా.. అదనంగా వాడుకుంటున్న నీటికి సైతం బిల్లులు చెల్లించకుండా తప్పించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలా నెలా నెలా రూ.కోట్లలో జలమండలి ఆదాయానికి గండి కొడుతున్నారు.

అక్రమాలు ఇలా..

గ్రేటర్‌ వ్యాప్తంగా 300 వరకు సర్వీసు రిజర్వాయర్లు ఉన్నాయి. శివార్లలోని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నుంచి సర్వీసు రిజర్వాయర్లలోకి మళ్లించి.. అక్కడ నుంచి గృహాలకు సరఫరా చేస్తుంటారు. అయితే ప్రధాన పైపులైన్లు, ఈ రిజర్వాయర్ల పరిధిలోని నల్లాలకు ఎక్కువ సమయం నీటి సరఫరా జరుగుతుంటుంది. ఇలాంటి నల్లాలు లక్ష నుంచి 2 లక్షల వరకు ఉంటాయని అంచనా.

నగరమంతా రోజు విడిచి రోజు.. 1 లేదా 2 గంటల పాటు సరఫరా జరుగుతుంటే.. ఈ ప్రాంతాల్లో మాత్రం ఆరేడు గంటలు, కొందరికి 24 గంటలపాటు సరఫరా ఉంటోంది. దీంతో ఆయా కనెక్షన్లకు నెలకు 20 వేల లీటర్ల కంటే ఎక్కువే నీళ్లు సరఫరా అవుతుంటాయి. ఉచితం పోను అదనపు నీటికి బిల్లులు చెల్లించాలి.

ఇక్కడే కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. మీటరు ఉంటే ఉచిత నీటి పథకం అమలు చేస్తుండటంతో.. తొలుత మీటరు అమర్చుతున్నారు. ఒకసారి ఉచిత పథకానికి అర్హత సాధించిన తర్వాత.. స్థానిక సిబ్బంది సహకారంతో ఆయా మీటర్లు తొలగిస్తున్నారు. లేదంటే టాంపరింగ్‌ చేస్తున్నారు.

 దీంతో ఎంత నీళ్లు వాడుకున్నప్పటికీ.. 20 వేల లీటర్ల లోపే రీడింగ్‌ చూపుతుంటుంది. ఇందుకు సహకారం అందించే మీటరు రీడర్లు, స్థానిక సిబ్బందికి నెలవారీ మామూళ్లు ముట్టజెప్పుతుండటంతో అక్రమాలు బయట పడటం లేదు.

ఎక్కువ శాతం 20 ఎంఎం డయా కనెక్షన్లలో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నాయి. చందానగర్‌, మాదాపూర్‌, శాలివాహన నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కాప్రా, ఉప్పల్‌ ప్రాంతాల్లో భారీ ఎత్తున ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. శివారు మున్సిపాలిటీల్లోనూ ఇదే పరిస్థితి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని