logo

బియ్యం సంచుల్లో గంజాయి రవాణా

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు చిక్కింది. ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా గొల్లుగొండకు చెందిన గొల్లి కుమారస్వామి(20), జొన్న స్వామి(20) నర్సీపట్నం ఐటీఐ కళాశాలలో స్నేహితులు.

Published : 28 Mar 2023 02:37 IST

ఈనాడు- హైదరాబాద్‌: ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల్లో గుట్టుగా గంజాయి రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులకు చిక్కింది. ఆంధ్రప్రదేశ్‌ అల్లూరి సీతారామరాజు జిల్లా గొల్లుగొండకు చెందిన గొల్లి కుమారస్వామి(20), జొన్న స్వామి(20) నర్సీపట్నం ఐటీఐ కళాశాలలో స్నేహితులు. చదువు మధ్యలోనే మానేసి కూలీ పనులు చేసుకుంటున్నారు. త్వరగా డబ్బు సంపాదించేందుకు గంజాయి స్మగ్లర్లుగా మారారు. గతేడాది జూన్‌లో తమిళనాడుకు గంజాయి తీసుకెళ్తుండగా ఏపీ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. గత నెల విడుదలయ్యారు. హైదరాబాద్‌కు తరచూ గంజాయి రవాణా చేసే అల్లూరి సీతారామరాజు జిల్లా లంబసింగికి చెందిన లక్ష్మణరావు అలియాస్‌ లచ్చన్నను సంప్రదించారు. అతని ఆదేశాలతో నర్సీపట్నం నుంచి 28 కిలోల గంజాయి, మూడు లీటర్ల హ్యాష్‌ ఆయిల్‌తో నిందితులు ఆదివారం బయల్దేరారు. బియ్యం సంచుల్లో గంజాయి నింపారు. సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ చేరుకున్న నిందితులు లక్ష్మణరావుకు ఫోన్‌ చేశారు. దాన్ని తీసుకునే వ్యక్తి కోసం ఆరాంఘర్‌ చౌరస్తాలో ఎదురు చూస్తున్నారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌స్పెక్టర్‌ మధు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణరావు పరారీలో ఉన్నట్లు సైబరాబాద్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని