logo

ఎంబీఎస్‌ డైరెక్టర్‌ నీతూ గుప్తాపై వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతి

ఎంబీఎస్‌ డైరెక్టర్‌ నీతూ గుప్తాపై వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ సోమవారం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 28 Mar 2023 02:49 IST

హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: ఎంబీఎస్‌ డైరెక్టర్‌ నీతూ గుప్తాపై వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ సోమవారం జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. జ్యుడీషియల్‌ సభ్యులు డాక్టర్‌ వెంకట రామకృష్ణ బద్రీనాథ్‌, సాంకేతిక సభ్యులు చరణ్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఎంబీఎస్‌ ఇంపెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తీసుకున్న రుణాన్ని ఎగవేయడంతో ఐసీఐసీఐ బ్యాంకు ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. రూ.37.57 కోట్ల రుణాన్ని చెల్లించకపోవడంతో దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ 2019 ఏప్రిల్‌లో ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా కంపెనీని స్వాధీనం చేసుకోవడానికి ఎవరూ ఆసక్తి కనపరచకపోవడంతో రుణదాతలు లిక్విడేషన్‌కు వెళ్లాలని నిర్ణయించారు. దివాలా రుణ పరిష్కార నిపుణుడు (ఆర్‌పీ) ఎన్‌సీఎల్‌టీలో దరఖాస్తు చేయగా గత ఏడాది మార్చిలో లిక్విడేషన్‌కు అనుమతించింది. ఎంబీఎస్‌ ఇంపెక్స్‌ లిమిటెడ్‌ తీసుకున్న రుణం బకాయితో సహా రూ.50 కోట్లు చెల్లించాల్సి ఉందని, హామీదారుగా ఉన్న డైరెక్టర్‌ నీతూ గుప్తాను దివాలాదారుగా ప్రకటించాలని ఐసీఐసీఐ బ్యాంకు 2022లో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ విచారణలో ఉండగనే ఐసీఐసీఐ బ్యాంకు రుణాన్ని ఒప్పందం ద్వారా రేర్‌ అస్సెట్‌ కన్‌స్ట్రక్షన్‌ స్వాధీనం చేసుకుని, పిటిషన్‌పై వాదనలు వినిపించింది. వాదనలను విన్న ధర్మాసనం రేర్‌ అస్సెట్‌ కన్‌స్ట్రక్షన్‌ పిటిషన్‌ను అనుమతిస్తూ నీతూ గుప్తా దివాలా ప్రక్రియకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దివాలా పరిష్కార ప్రక్రియ నేపథ్యంలో నీతూ గుప్తాకు చెందిన స్థిరచరాస్తుల క్రయ, విక్రయాలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని