logo

ఖాతాలతోనే సరి

అనాథలు, పేద బాలికలకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను నెలకొల్పింది. ఆరంభంలో పిల్లలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చింది.

Published : 28 Mar 2023 02:57 IST

నగదు అందక బాలికలకు తప్పని నిరాశ
న్యూస్‌టుడే, పరిగి, వికారాబాద్‌ కలెక్టరేట్‌

నాథలు, పేద బాలికలకు ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాలను నెలకొల్పింది. ఆరంభంలో పిల్లలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చింది. దీంతో చాలా మంది ఉత్సాహంగా చేరి చదువుకుంటున్నారు. ఏడాది కాలంగా బాలికలకు ఆరోగ్యకిట్లు పంపిణీ చేయలేకపోతోంది. కరోనా పరిస్థితుల నాటి నుంచి నేటి వరకు అందకపోవడంతో పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. సమస్యను పలుమార్లు ఉన్నతాధికారులకు నివేదించినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కేజీబీవీల్లో తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారే అధికంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చేతిలో డబ్బులు లేక మనో వేదనకు గురవుతున్నారు. విద్యా సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. కనీసం ఇప్పుడైనా డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు.

కొనుగోలు స్తోమత లేదు..

పేదింటి బాలికలకు కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత లేకపోవడంతో నూనె, పౌడరు వంటి వాటికి కూడా నోచుకోలేకపోతున్నారు.  ప్రభుత్వమే బొట్టు, రిబ్బన్లు, దువ్వెన, రెండు రకాల సబ్బులు, షాంపూలు, పౌడర్‌, బ్రష్‌, టూత్‌పేస్ట్‌, కొబ్బరినూనె, న్యాప్‌కిన్లు, అలంకరణ సామగ్రి, రబ్బరు బ్యాండ్లు తదితరాలను ప్రతినెలా సమకూర్చాలి. కరోనా సమయం నుంచి కిట్ల పంపిణీ పూర్తిగా అటకెక్కింది. అంతేగాకుండా చివరకు నోటు పుస్తకాల పంపిణీ కూడా జరగలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో గ్రహించవచ్చని పలువురు పేర్కొంటున్నారు.

నెలకు వంద చొప్పున ఏదీ..

కిట్లకు బదులుగా నెలకు రూ.100 చొప్పున ప్రతి ఒక్క విద్యార్థినికి అందించేందుకు విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ఆగమేఘాగాల మీద విద్యార్థులతో జీరో బ్యాంకు ఖాతాలను ప్రారంభించారు. దాదాపు మూడు నెలలు కావస్తున్నా ఖాళీ ఖాతాలే వెక్కిరిస్తున్నాయి. విద్యా సంవత్సరం ముగియవస్తున్నా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలికలు నిరాశ చెందుతున్నారు. నిర్వాహకులను అడిగితే ప్రభుత్వం నుంచి రావాల్సి ఉందని రెండున్నర నెలలుగా నెట్టుకొస్తున్నామని వారు వాపోతున్నారు.  

మొత్తం కస్తూర్బాలు 18
విద్యార్థులు 5150
ఆరోగ్య కిట్లు.. కరోనా తరువాత లేవు
రూ.100.. నేటికీ జమకాలేదు


త్వరలో వచ్చే అవకాశం
- పి.సంధ్య, జిల్లా ఇంఛార్జి, కస్తూర్బా విద్యాలయాలు

వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి నగదు సాయం అందించేందుకు అందరికీ ఖాతాలు ప్రారంభించాం. రూ.100 చొప్పున వారి వారి ఖాతాల్లో జమకానున్నాయి. ప్రభుత్వం త్వరలోనే అందజేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని