logo

గొంతు కోసి.. వ్యవసాయ బావిలో పడేసి

వ్యవసాయ భూమికి కాపలాదారులుగా ఉన్న ఇద్దరు మిత్రుల మధ్య మద్యం విషయంలో చిన్నపాటి వివాదం చెలరేగింది. ఈ క్రమంలో వారిలో ఒకరు సహనం కోల్పోయి..

Published : 28 Mar 2023 03:09 IST

మద్యం కోసం వేధించడంతో హత్య

మృతుడు ప్రొబీన్‌ బోరా, నిందితుడు అచ్చెలాల్‌ గుప్తా

శామీర్‌పేట, న్యూస్‌టుడే: వ్యవసాయ భూమికి కాపలాదారులుగా ఉన్న ఇద్దరు మిత్రుల మధ్య మద్యం విషయంలో చిన్నపాటి వివాదం చెలరేగింది. ఈ క్రమంలో వారిలో ఒకరు సహనం కోల్పోయి.. మరొకర్ని గొంతు కోసి చంపి మృతదేహాన్ని వ్యవసాయ బావిలో పడవేశాడు. అనంతరం నిందితుడు శామీర్‌పేట ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం లాల్‌గడిమలక్‌పేట గ్రామ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. లాల్‌గడిమలక్‌పేట పరిధిలో హైటెక్‌ సీడ్స్‌ కంపెనీ 20 ఎకరాల వ్యవసాయ భూమిని లీజుకు తీసుకుంది. ఆ భూమికి కాపలాదారులుగా ఉత్తర్‌ప్రదేశ్‌ పిప్రాకనాక్‌ ప్రాంతానికి చెందిన అచ్చెలాల్‌గుప్తా (43), తుర్కపల్లిలో నివసించే అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రొబీన్‌ బోరా (41) పని చేస్తున్నారు. ఏడాదిగా ఒకేచోట కలిసి పనిచేస్తుండడంతో స్నేహితులయ్యారు. మద్యానికి అలవాటు పడిన ప్రొబీన్‌బోరా,  అచ్చెలాల్‌గుప్తాను నిత్యం మద్యం కోసం వేధించేవాడు. మరోవైపు ఈ విషయాన్ని కంపెనీ యజమానికి చెబితే చంపేస్తానంటూ కత్తితో బెదిరించాడు. ఈ నెల 26న అర్ధరాత్రి  మద్యం ఇప్పించాలని కోరాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. సహనం కోల్పోయిన అచ్చెలాల్‌గుప్తా.. ప్రొబీన్‌ బోరాను కత్తితో గొంతు కోసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశాడు. ఘటనాస్థలంలోని రక్తం మరకలను నీటితో కడిగేశాడు. అనంతరం శామీర్‌పేట ఠాణాకెళ్లి లొంగిపోయాడు.  ఇన్‌స్పెక్టర్‌ వి.సుధీర్‌కుమార్‌, పోలీసు సిబ్బంది, శామీర్‌పేట అగ్నిమాపక కేంద్రం సిబ్బంది సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని