logo

డేటా చౌర్యం.. బిగుస్తున్న ఉచ్చు

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన 16.5 కోట్ల మంది డేటా చౌర్యం కేసులో సైబరాబాద్‌ పోలీసులు నిందితుల చుట్టూ ఉచ్చుబిగిస్తున్నారు.

Published : 28 Mar 2023 03:17 IST

ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భద్రతా లోపాలపై సిట్‌ దృష్టి

ఈనాడు- హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన 16.5 కోట్ల మంది డేటా చౌర్యం కేసులో సైబరాబాద్‌ పోలీసులు నిందితుల చుట్టూ ఉచ్చుబిగిస్తున్నారు. కోట్ల మంది డేటా లీకవ్వడం.. జాతీయ భద్రతతో ముడిపడిన అంశంకావడంతో అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు.. భద్రతా లోపాలను అన్వేషించే పనిలో పడ్డారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో డేటా భద్రపర్చడంలో వైఫల్యం ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకోసం సాంకేతిక నిపుణుల సాయం తీసుకుంటున్నారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న డేటాను ఐటీ చట్టం ప్రకారం సమాచారాన్ని విభజిస్తున్నారు. ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని పీఐఐ (పర్సనల్‌ ఐడెంటిఫైయింగ్‌ ఇన్ఫర్మేషన్‌), రక్షణ శాఖ, ఇతర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగుల కీలక సమాచారాన్ని ఎస్‌పీడీఐ(సెన్సిటివ్‌ పర్సనల్‌ డేటా ఇన్ఫర్మేషన్‌)గా విభజిస్తున్నారు. అనంతరం ఐటీ చట్టం ముందుకెళ్తామని అధికారులు చెప్పారు.

రక్షణ శాఖ సంప్రదింపులు

ఈ వ్యవహారంలో దేశ రాజధాని పరిధిలో(ఎన్‌సీఆర్‌) పనిచేసే రక్షణ శాఖ ఉద్యోగుల డేటా ఎందుకోసం కొన్నారనే అంశం అత్యంత చర్చనీయాంశంగా మారింది. నిందితులు ఎందుకు కొన్నారు..? అసలు ఎక్కడి నుంచి కొట్టేశారనే అంశం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల దిల్లీ, హైదరాబాద్‌కు చెందిన ఆర్మీ అధికారులు సైబరాబాద్‌ అధికారులతో మాట్లాడారు. మరింత అదనపు సమాచారం కోసం రక్షణ శాఖకు చెందిన కొందరు అధికారులు మరోసారి సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ప్రస్తుతం లభ్యమైన డేటాను ఏ విభాగంలో నమోదు చేస్తారనే కోణంలో గుర్తించి.. రక్షణ శాఖ అధికారులు అంతర్గతంగా విచారణ చేయిస్తున్నట్లు సమాచారం. హ్యాక్‌ చేయడం లేదా..? ఉద్యోగుల ద్వారా ఇదంతా లీకైందా అనేది పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నేటి నుంచి ఐదు రోజుల కస్టడీ..!

నిందితుల కస్టడీ మంగళవారం నుంచి మొదలుకానుంది. కుమార్‌ నీతీశ్‌ భూషణ్‌, సుశీల్‌ తోమర్‌, అతుల్‌ ప్రతాప్‌ సింగ్‌, సందీప్‌ పాల్‌ను మాత్రమే కస్టడీకి తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. శనివారం వరకూ కస్టడీ కొనసాగుతుంది. నిందితులు ఇచ్చే సమాచారంతో ఈ కేసు మలుపు తిరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. డేటా కొన్న వ్యక్తుల సమాచారం తెలిస్తే.. ఎందుకు వినియోగించారో వెలుగులోకి వస్తుంది. తదుపరి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని