logo

సాగర్‌ చెంత కొత్త ఆకర్షణ

హుస్సేన్‌ సాగర్‌ తీరం చెంత మరో కొత్త పర్యాటక ఆకర్షణ కేంద్రం నీరా కేఫ్‌ సిద్ధమైంది. అతి త్వరలో ఇది అందుబాటులోకి రానుంది.

Published : 28 Mar 2023 03:25 IST

త్వరలో అందుబాటులోకి నీరా కేఫ్‌

ఈనాడు, హైదరాబాద్‌: హుస్సేన్‌ సాగర్‌ తీరం చెంత మరో కొత్త పర్యాటక ఆకర్షణ కేంద్రం నీరా కేఫ్‌ సిద్ధమైంది. అతి త్వరలో ఇది అందుబాటులోకి రానుంది. లుంబినీ పార్కు, ఎన్టీఆర్‌ గార్డెన్‌, సంజీవయ్య పార్కు, పీవీ జ్ఞానభూమి, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి స్మృతివనం ఇలా అనేక ఆకర్షణలతో హుస్సేన్‌ సాగర్‌ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారింది. వీటిని తిలకించేందుకు వచ్చిన సందర్శకులకు తెలంగాణ రుచులు అందించడానికి నెక్లెస్‌ రోడ్డులో ‘నీరా కేఫ్‌’ రూపుదిద్దుకుంది. కల్లుగీత వృత్తికి అద్దం పడుతూ దీన్ని నిర్మించారు. కింద అంతా.. నీరా అమ్మకాలతోపాటు.. తెలంగాణ వంటకాల స్టాళ్లుంటాయి. పై అంతస్తులో ఒక సమావేశ మందిరం, రెస్టారెంటు ఉంటుంది.  

బోటు దగ్గరకు వెళ్లేందుకు నిర్మించిన వంతెన

ఇక్కడి నుంచి బోటు షికారు..

హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు రెండో యూనిట్‌ నీరాకేఫ్‌ వెనుకభాగంలో అందుబాటులోకి తెచ్చారు. కేఫ్‌ను నిర్మించాక.. అక్కడ సౌకర్యాలు మెరుగుపరచి సులభంగా బోటు షికారు యూనిట్‌కు చేరేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం లుంబినీ పార్కు వద్ద ఉన్న యూనిట్‌పై అధిక రద్దీ ఒత్తిడి పడకుండా రెండో యూనిట్‌ ఉపయోగపడుతుందని పర్యాటకాధికారులు చెబుతున్నారు. నెక్లెస్‌ రోడ్డులో విహరించేవారు లుంబినీ బోటు యూనిట్‌ వరకూ వెళ్లాల్సిన అవసరం లేకుండా.. సాగర్‌కు దక్షిణవైపు నుంచి కూడా ప్రయాణించడానికి వీలు కల్పించినట్టయ్యింది. ఇందుకోసం సాగర్‌లోకి కొంత దూరం వెళ్లేందుకు ఇనుప వంతెన, బోటు షికారుకు ఉద్దేశించిన జెట్టీ ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని