logo

విమానాశ్రయ మెట్రోకు భూసామర్థ్య పరీక్షలు షురూ

విమానాశ్రయ మెట్రో కోసం భూసామర్థ్య పరీక్షలు(సాయిల్‌ టెస్ట్‌) ప్రారంభించినట్టు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

Published : 28 Mar 2023 03:32 IST

ఐకియా జంక్షన్‌ సమీపంలో భూసామర్థ్య పరీక్షలు చేసేందుకు యంత్రాన్ని సిద్ధం చేస్తున్న కార్మికులు

ఈనాడు, హైదరాబాద్‌: విమానాశ్రయ మెట్రో కోసం భూసామర్థ్య పరీక్షలు(సాయిల్‌ టెస్ట్‌) ప్రారంభించినట్టు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం అలైన్‌మెంట్‌ స్థిరీకరణ, పెగ్‌మార్కింగ్‌ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని వెల్లడించారు. రాయదుర్గం ఐకియా జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 31 కి.మీ. మేర చేపట్టబోయే మెట్రో నిర్మాణంలో భాగంగా 100 పిల్లర్లు నమూనాగా తీసుకుని భూసామర్థ్య పరీక్షలు చేపట్టనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిచోట భూ ఉపరితలం నుంచి సుమారు 40 అడుగుల లోతు వరకు తవ్వకాలు జరిపి అక్కడికక్కడ పరీక్షలు, మట్టి నమూనాలు ప్రయోగశాలకు తరలించి పరీక్షల ద్వారా సామర్థ్యాన్ని నిర్ణయిస్తామని వివరించారు. ఈ పనులు పూర్తవడానికి సుమారు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలిపారు. పరీక్షల ద్వారా స్తంభాల పునాదులు ఏ మేరకు తవ్వాలి. ఓపెన్‌ ఫౌండేషన్‌ లేదా ఫైల్‌ ఫౌండేషన్‌ నిర్ణయం, బేరింగ్‌ ప్రెజర్‌, తదితర విషయాలపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు. టెండర్లలో పాల్గొనే బిడ్డర్లకు ప్రాజెక్టు నిర్మాణంలో భూమి తీరుపై అవగాహనతోపాటు ఆర్థిక అంచనాలు రూపొందించుకోవడంలో ఈ పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు. చీఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ బి.ఆనంద్‌మోహన్‌, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ సాయపరెడ్డి నేతృత్వంలోని హెచ్‌ఏఎంఎల్‌ ఇంజినీర్‌ బృందం భూసామర్థ్య పరీక్షలు నిర్వహిస్తోంది. జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, ట్రాఫిక్‌ పోలీస్‌శాఖల సమన్వయంతో ఎయిర్‌పోర్టు మెట్రో ముందస్తు పనులు చురుకుగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు