logo

చిత్తశుద్ధి లేదు.. తీరు మారలేదు

హుస్సేన్‌సాగర్‌లో దుర్వాసన గుప్పుమంటోంది. ముక్కుపుటాలు అదురుతుండటంతో సాయంత్రం వేళ అటువైపు వెళ్లి నిముషం పాటు నిలబడే పరిస్థితి లేదు.

Published : 28 Mar 2023 03:42 IST

రసాయన, పారిశ్రామిక వ్యర్థాలతో హుస్సేన్‌సాగర్‌లో పెరిగిన బీవోడీ

ఈనాడు, హైదరాబాద్‌: హుస్సేన్‌సాగర్‌లో దుర్వాసన గుప్పుమంటోంది. ముక్కుపుటాలు అదురుతుండటంతో సాయంత్రం వేళ అటువైపు వెళ్లి నిముషం పాటు నిలబడే పరిస్థితి లేదు. ఇటీవల వర్షాలతో నాలాల నుంచి చేరుతున్న మురుగునీరు, పారిశ్రామిక, రసాయన వ్యర్థాలతో నీటి నాణ్యత నానాటికీ పడిపోతోంది. శుద్ధి చేయకుండా వదిలేస్తున్న మురుగుకు అడ్డుకట్ట పడకపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. 20 ఏళ్లుగా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. పీసీబీ వెల్లడించిన నీటి నాణ్యత పరీక్షల్లోనూ బయోలాజికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీవోడీ) స్థాయిలు అధికమవ్వడం కాలుష్యం పెరుగుతోందనడానికి నిదర్శనం. అయిదు ఫీడర్‌ ఛానళ్ల ద్వారా రోజుకు 350 ఎంఎల్‌డీలకు పైగా వ్యర్థ జలాలు సాగర్‌లో కలుస్తున్నాయి. వ్యర్థ బ్యాక్టీరియాలు నశించి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలు పెరిగేందుకు ఐఎం సొల్యూషన్స్‌ను ట్యాంకర్లతో సాగర్‌లో చల్లుతున్నామని చెబుతున్నా.. అది పెద్దగా ఫలితాలనివ్వడం లేదని తాజా అధ్యయనాల ద్వారా స్పష్టమవుతోంది.  కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం.. లీటర్‌ నీటిలో బీవోడీ 3 ఎంజీలు, కరిగిన ప్రాణవాయువు మోతాదు (డీవో) 4 ఎంజీలు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే జలచరాలు బతకవు. పీసీబీ నిర్వహించిన నీటినాణ్యత పరీక్షల ఫలితాలను పరిశీలిస్తే 9 ప్రాంతాల్లో డీవో సగటున 4 మిల్లీగ్రాములుగా నమోదవ్వడం ఊరటనిచ్చే అంశం. బీవోడీ సగటున 22 మిల్లీగ్రాములు నమోదైనట్లు తాజా లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. పీసీబీ ప్రమాణాల ప్రకారం ఇది 3 మి.గ్రా. ఉండాలి. ఇటీవల వర్షాలు రసాయన, పారిశ్రామిక వ్యర్థాలు చేరడంతో బీవోడీ మోతాదు పెరిగినట్లు పీసీబీ నిపుణులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని