logo

ఉద్యోగార్థి ఊరుబాట

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో పోటీపరీక్ష అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఏళ్లుగా సన్నద్ధమైనవారు, ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చి సాధన చేసినవారు, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న అభ్యర్థులు సొంతూళ్లకు తిరుగుపయనమయ్యారు.

Published : 29 Mar 2023 02:21 IST

ఈనాడు, హైదరాబాద్‌

అశోక్‌నగర్‌ స్టడీహాల్‌లో సగం కుర్చీలు ఖాళీగానే..

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో పోటీపరీక్ష అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. ఏళ్లుగా సన్నద్ధమైనవారు, ఉద్యోగానికి సెలవు పెట్టి వచ్చి సాధన చేసినవారు, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్న అభ్యర్థులు సొంతూళ్లకు తిరుగుపయనమయ్యారు. ఒకప్పుడు ప్రైవేటు వసతి గృహాల్లో చేరేందుకు విపరీతమైన డిమాండ్‌ ఉన్న అశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్‌, చిక్కడపల్లిలో ప్రస్తుతం సులువుగా వాటిలో ప్రవేశం లభిస్తోంది. చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం, అఫ్జల్‌గంజ్‌ రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం, ప్రైవేటు స్టడీహాస్టళ్లలో రద్దీ తగ్గిపోయింది.

ఖాళీ కుర్చీలు దర్శనం

పోటీ పరీక్షల ప్రకటనలు వెలువడిన సమయంలో చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో రోజూ 2వేల వరకు అభ్యర్థులు వచ్చి సన్నద్ధమయ్యేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1200 నుంచి 1500కు పడిపోయింది. రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో సన్నద్ధమయ్యేందుకు విద్యార్థులు టిఫిన్‌బాక్సులు తెచ్చుకొని సాయంత్రం వరకు అక్కడే ఉండేవారు. ప్రస్తుతం అక్కడ తాళాలు వేసిన కుర్చీలు, ఖాళీ మైదానం దర్శనమిస్తోంది. ఇక స్టడీహాళ్ల విషయానికొస్తే ఖాళీ ఎప్పుడుంటుందో అని ఎదురుచూసే స్థాయి నుంచి ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షపై గందరగోళం

ఇటీవల నిర్వహించిన గ్రూప్‌-1లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలకు సెలవు పెట్టి, ప్రైవేటు ఉద్యోగాలు వదులుకొని వచ్చినవారే. వీరంతా ప్రిలిమ్స్‌లో అర్హత సాధించడంతో మెయిన్స్‌కు సన్నద్ధమయ్యారు. ఈ లోగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రం లీకేజీ బహిర్గతం అవడం, ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీలు ప్రకటించడంతో మెయిన్స్‌ పరీక్ష జరిగే తేదీలపై గందరగోళం ఏర్పడింది. ఇప్పట్లో మెయిన్స్‌ జరిగే అవకాశం లేదని భావించి చాలా మంది తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోయారని, మరికొందరు వారి ఉద్యోగాల్లో చేరిపోయారని సన్నిహితులు చెబుతున్నారు. డివిజన్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పరీక్షలు రద్దు చేసి మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడంతో వేర్వేరు పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తాజా పరిస్థితులను కొన్ని కోచింగ్‌ సెంటర్లు నగదుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షకు 60 రోజులు సమయం ఉందంటూ ఈ 60 రోజుల్లో అర్హత సాధించడమెలా..? అంటూ కొత్త ప్రణాళికతో ముందుకొస్తున్నాయి.

వెలవెలబోతున్న అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని