logo

సమీపిస్తున్న సమయం.. సౌకర్యాలు అసంపూర్ణం

జిల్లాలో ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యా శాఖ తగిన విధంగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 70 రెగ్యులర్‌, 4 ప్రైవేటు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Updated : 29 Mar 2023 05:26 IST

ఏప్రిల్‌ 3 నుంచి పది పరీక్షలు
న్యూస్‌టుడే, పరిగి, దోమ, బొంరాస్‌పేట, బషీరాబాద్‌, తాండూరు, వికారాబాద్‌  

జిల్లాలో ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యా శాఖ తగిన విధంగా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా 70 రెగ్యులర్‌, 4 ప్రైవేటు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఫిజికల్‌ సైన్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌, కాంపొజిట్‌ తెలుగు కోర్సు రాసే విద్యార్థులకు మరో 20 నిమిషాల సమయం అదనంగా కేటాయించారు. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని పరీక్షలు రాసేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి రేణుకాదేవి తెలియజేస్తున్నారు. ఇదే సమయంలో పలు పరీక్ష కేంద్రాలను ‘న్యూస్‌టుడే’ పరిశీలించగా అరకొర సౌకర్యాలే కనిపించాయి. ఆ వివరాలు..

రవాణాకు ఇక్కట్లు పడాల్సిందేనా..

కొడంగల్‌ నియోజకవర్గంలో పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటంతో రవాణాకు ఇబ్బందులు తప్పవని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల నుంచి బస్సు సౌకర్యాలు లేకపోవటంతో సుమారు 15- 20 కి.మీ. దూరం నుంచి ఆటోల్లోనే వెళ్లక తప్పదు.

* కొడంగల్‌లో బాలికలు, బాలుర ఉన్నత పాఠశాలల్లోని తరగతి గదుల కిటికీలకు తలుపులు సక్రమంగా లేవు. బాలుర పాఠశాలకు ప్రహరీ లేకపోవటంతో ఆకతాయి చర్యలకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

* బొంరాస్‌పేట మండల కేంద్రంలో ఉన్నత పాఠశాలలోనే రెండు కేంద్రాలు ఏర్పాటుచేశారు. సరిపడు బెంచీలు లేకపోవటంతో ఇతర పాఠశాలనుంచి సర్దుబాటు చేస్తున్నారు. దౌల్తాబాద్‌ మండలంలో ఉన్నత పాఠశాలకు ప్రహరీ సక్రమంగా లేదు.  

* జిల్లా కేంద్రం వికారాబాద్‌లోని ఆలంపల్లి ఉన్నత బాలుర పాఠశాలలో సరిపోయే బెంచీలు ఏర్పాటుచేసినా.. కొన్నింటికి మరమ్మతులు చేపట్టలేదు.

* దోమ మండలంలో బాలుర ఉన్నత, బాలిక పాఠశాలలో బాలికలకు తప్ప బాలురకు మరుగుదొడ్ల సౌకర్యం లేదు. దోమ బాలుర ఉన్నత పాఠశాలలోని 3 గదులకు, దాదాపూర్‌లో 5 గదులకు విద్యుత్‌ సౌకర్యంలేదు.  

* కుల్కచర్ల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో నాలుగు గదుల్లో ఫ్యాన్లు, లైట్లు లేవు.  

* పరిగిలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్ల పనులు జరుగుతున్నాయి. శౌచాలయాల నిర్వహణ బాగాలేదు.  

విద్యుత్‌ సరఫరాకు చర్యలు

తాండూరు నియోజకవర్గంలో 21 పరీక్షలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అనేకచోట్ల విద్యుత్‌ సమస్యలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు గాలి పంకాలు అమర్చుతున్నారు. స్విచ్‌బోర్డులు బాగు చేయిస్తున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు మరమ్మతులు చేయించి నీటి సౌకర్యాన్ని పరిశీలిస్తున్నారు.

కుల్కచర్ల బాలుర ఉన్నత పాఠశాలలో శౌచాలయాల దుస్థితి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని