logo

భారాసలో భగ్గుమన్న విభేదాలు

వికారాబాద్‌ భారాసలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. మంగళవారం వికారాబాద్‌ పట్టణ శివారులోని ఓ వ్యవసాయక్షేత్రంలో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులుగా ముద్రపడిన భారాస నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు.

Published : 29 Mar 2023 02:21 IST

డీఎస్పీతో వాగ్వాదం చేస్తున్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయ నేత  

వికారాబాద్‌, న్యూస్‌టుడే: వికారాబాద్‌ భారాసలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి. మంగళవారం వికారాబాద్‌ పట్టణ శివారులోని ఓ వ్యవసాయక్షేత్రంలో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే వ్యతిరేక వర్గీయులుగా ముద్రపడిన భారాస నాయకులు రహస్యంగా సమావేశమయ్యారు. కొందరు కార్యకర్తలు తెలిపిన ప్రకారం..ఎమ్మెల్యే ఆనంద్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నిన్న మొన్న ఇతర పార్టీల నుంచి చేరిన వారిని అందలం ఎక్కిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వైఖరిని కేసీఆర్‌, కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రహస్య భేటీ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుకూల వర్గీయ నాయకులు పలువురు అక్కడికి వెళ్లి వారితో పాటు కూర్చున్నారు. ఈ పరిణామాన్ని ఊహించని వ్యతిరేక వర్గీయులు తుది దశలో ఉన్న చర్చను నిలిపివేశారు. రహస్య భేటీ నిర్వహించాల్సిన అవసరం ఏమొచ్చిందని, సమాచారం ఇస్తే తామూ వచ్చేవారమని వాదనకు దిగారు. ఇరు వర్గాలకు చెందిన నాయకులు నినాదాలు చేశారు. రభస, తోపులాట జరిగింది. గుడారాన్ని (టెంట్‌) పీకి వేశారు. వికారాబాద్‌ డీఎస్పీ సత్యనారాయణ ఆధ్వర్యంలో వికారాబాద్‌, ధారూర్‌ సీఐలు శ్రీను, అప్పయ్యలు పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా సమావేశం నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు.  పోలీసుల జోక్యంతో గొడవ సద్దు మణిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని