logo

మంటలొస్తే.. తప్పించుకునేదెలా?

తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రూబీ హోటల్‌ ఘటన మరవక ముందే.. స్వప్నలోక్‌ అగ్నిప్రమాదంలో అమాయకులు మరణించడం ఆందోళన కలిగించింది.

Published : 29 Mar 2023 02:21 IST

ఎవాక్యుయేషన్‌ ప్లాన్‌ ప్రదర్శిస్తున్నారా?
ఈనాడు, హైదరాబాద్‌

తరచూ జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నగరవాసుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. రూబీ హోటల్‌ ఘటన మరవక ముందే.. స్వప్నలోక్‌ అగ్నిప్రమాదంలో అమాయకులు మరణించడం ఆందోళన కలిగించింది. నగరంలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, ఆసుపత్రులు వంటి జనసంచారం ఉండే ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే తప్పించుకునే మార్గాలున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, గోదాముల్లో ప్రమాద నివారణ చర్యలు తీసుకోవడం.. ప్రమాదాలు జరిగితే తక్షణమే తప్పించుకునేలా వ్యూహాలపై అవగాహన ఉండాలని సూచిస్తున్నారు.

ఆసుపత్రులు, షాపింగ్‌ మాల్‌లు, మల్టీపెక్స్‌లు, హోటళ్లలో అంతస్తులను ఫైర్‌ కంపార్ట్‌మెంట్లుగా విభజించాలి. చెత్తాచెదారం పోగు కాకుండా, గ్యాస్‌ల నిల్వలో  జాగ్రత్తలు పాటించాలి. ర్యాంపులకు, మెట్లకు అడ్డంగా ఎటువంటి సామాన్లు ఉంచొద్దు. అత్యవసర ద్వారాలకు, ఫైర్‌ డోర్లకు తాళాలు వేయకూడదు. అగ్నిమాపక పరికరాలు ఉన్న స్థలాలు, బయటకు వెళ్లే మార్గాలు, మెట్లను చూపుతున్న ఎవాక్యుయేషన్‌ ప్లాన్‌ను ప్రతి అంతస్తులో అందరికీ కనిపించేలా అతికించాలి. ప్రతి ఐదేళ్లకోసారి ఎలక్ట్రిక్‌ పరికరాలను లైసెన్స్‌డ్‌ ఇంజినీర్లతో పరీక్ష చేయించి.. అవసరమైన మార్పులు చేపట్టాలి. బ్యాటరీ బ్యాకప్‌తో కనీసం 90 నిమిషాలు పనిచేసేలా ఎమర్జెన్సీ లైటింగ్‌, ఆటో గ్లో ఎగ్జిట్‌ సైన్‌ ఏర్పాటు చేసుకోవాలి. అర్హులైన ఫైర్‌ అధికారిని, ఎవాక్యుయేషన్‌ సూపర్‌వైజర్లను నియమించుకోవాలి. తరచూ మాక్‌డ్రిల్‌ నిర్వహించాలి.

పరిశ్రమల్లో..

నిషేధిత ప్రదేశాల్లో సిగరెట్లు తాగడం, విద్యుత్తు ఉపకరణాల్లో స్పార్క్‌లు, షార్ట్‌ సర్క్యూట్‌, ఓవర్‌ లోడింగ్‌, వదులు వైరింగ్‌, మండే స్వభావం ఉన్న పదార్థాల లీకేజీ, వెల్డింగ్‌, కటింగ్‌, షోల్డరింగ్‌, పరిశ్రమల యంత్రాల నిర్వహణ లోపాలు అగ్నిప్రమాదాలకు కారణం. రసాయనాలను ఒక చోట కాకుండా వేర్వేరుగా నిల్వ చేయాలి.

మంటల్లో చిక్కుకుంటే..

అగ్నిప్రమాదం సంభవిస్తే ఫైర్‌ అలారం మోగించాలి. లిఫ్ట్‌ వాడకుండా మెట్ల మార్గాన్ని ఎంచుకోవాలి. ఫైర్‌ అలారం వినగానే గాబరా పడకుండా ఎవాక్యుయేషన్‌ ప్లాన్‌ అనుసరించాలి. ఒక వేళ పొగలో చిక్కుకుపోతే.. మెల్లగా శ్వాస పీలుస్తూ నేలపై పాకుతూ ఎగ్జిట్‌ వైపు వెళ్లాలి. పొగ గది పైభాగంలో ఎక్కువగా, కింది భాగంలో తక్కువగా ఉంటుంది. ముఖానికి తడి రుమాలు లేదా టవల్‌ చుట్టుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని