logo

స్వీయ తప్పిదం.. ప్రాణగండం!

నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. సంవత్సరానికి 2,100-2,200 దాకా ప్రమాదాలు జరుగుతుండగా.. రోజూ సగటున 7-8 మంది గాయాలపాలవుతున్నారు.

Published : 29 Mar 2023 02:21 IST

ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు, అతి వేగం
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. సంవత్సరానికి 2,100-2,200 దాకా ప్రమాదాలు జరుగుతుండగా.. రోజూ సగటున 7-8 మంది గాయాలపాలవుతున్నారు. ఒకరిద్దరు మృత్యువాత పడుతున్నారు. గతేడాది స్వీయ తప్పిదాలతో 80 ప్రమాదాలు జరగ్గా, 83 మంది మరణించారు. ఈ ఏడాది మార్చి 20 వరకు 57 మంది మరణిస్తే, వీరిలో 15 మంది అతి వేగం, మద్యం మత్తులో మృత్యువాతపడ్డారు.

కేసులు నమోదవుతున్నా.. నగరంలో సగటు వాహన వేగం గంటకు 25-35 కి.మీ. అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున 100-120 కి.మీ వేగంతో కార్లు, ద్విచక్రవాహనాలు దూసుకెళ్తుంటాయి. భారీ వాహనాలు, టిప్పర్లు, ట్యాంకర్లు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా తిరుగుతున్నాయి. ఫిలింనగర్‌-షేక్‌పేట్‌ నాలా మార్గంలో పెద్దఎత్తున నిర్మాణాలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి నిర్మాణ వ్యర్థాలను రాత్రి 9 తర్వాత తరలిస్తున్నారు. టిప్పర్లను అడ్డదారిలో నడిపిస్తున్నారు. జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ మార్గాల్లో అర్ధరాత్రి దాటినా బార్లు, పబ్‌లు తెరిచే ఉంటున్నాయి. మత్తులో రోడ్లపైకి చేరిన మందు బాబులు మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నట్లు స్థానికులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది 79 రోజుల వ్యవధిలో జరిగిన 320కి పైగా రోడ్డు ప్రమాదాల్లో 60-70 శాతం అతివేగం, మద్యం మత్తు, నిర్లక్ష్యం వంటి స్వీయతప్పిదాలే కారణమని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. నగరంలో ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై రోజుకు 17,000 కేసులు నమోదవుతున్నా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.


ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాం

నగరంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న 65  ప్రాంతాలను గుర్తించాం. రోడ్‌ యాక్సిడెంట్‌ ఎనాలసిస్‌ గ్రూపు(రాగ్‌) ఆధ్వర్యంలో వివిధ విభాగాలతో సమన్వయం చేసుకొని నివారణ చర్యలు చేపడుతున్నాం. తరచూ తనిఖీలు చేస్తున్నాం. 10 శాతం ప్రమాదాలను తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.

 సుధీర్‌బాబు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని