logo

సులువైన పరిష్కారమా.. సృజనకు నియంత్రణా?

గూగుల్‌ను దాటేసి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కృత్రిమ మేధపై విశ్వవిద్యాలయాల్లో చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, యువతకు చాట్‌ జీపీటీ సులువైన పరిష్కారాలను అందిస్తోందని అంటుంటే.. పిల్లల్లో సృజనను అది నియంత్రిస్తోందని కొందరు ఆచార్యులు పేర్కొంటున్నారు.

Published : 29 Mar 2023 02:21 IST

యువత, విద్యార్థులపై చాట్‌ జీపీటీ ప్రభావం.. నిషేధం విధించిన సీబీఎస్సీ
ఈనాడు, హైదరాబాద్‌

గూగుల్‌ను దాటేసి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కృత్రిమ మేధపై విశ్వవిద్యాలయాల్లో చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు, యువతకు చాట్‌ జీపీటీ సులువైన పరిష్కారాలను అందిస్తోందని అంటుంటే.. పిల్లల్లో సృజనను అది నియంత్రిస్తోందని కొందరు ఆచార్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో వందల ఐటీ కంపెనీలు, వేల మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు, రెండు లక్షల మంది విద్యార్థులు చాట్‌   జీపీటీని వినియోగిస్తున్నారని అనధికారిక లెక్క.

దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు వినియోగిస్తున్న చాట్‌ జీపీటీ కృత్రిమ మేధ వినియోగాన్ని నిషేధిస్తూ సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్సీ) బుధవారం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు జరుగుతున్న గదుల్లోకి విద్యార్థులు సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని, చాట్‌ జీపీటీ వినియోగించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒక ప్రశ్నను చాట్‌ జీపీటీలో నమోదు చేస్తే.. క్షణాల్లో సమాధానం వస్తుందని ఉపాధ్యాయులు, అధ్యాపకులు బోర్డు అధికారులకు వివరించడంతో కృత్రిమ మేధ వినియోగంపై నిషేధం విధించారు.


విద్యార్థులు, యువతకు నచ్చింది

చాట్‌ జీపీటీ కృత్రిమ మేధ విద్యార్థులు, యువతకు చాలా నచ్చింది. కృత్రిమ మేధ ద్వారా వారికి సులువైన పరిష్కారాలు లభిస్తున్నాయి. దీనివల్ల చాలామందిలో సృజనాత్మకత తగ్గుతోంది. ఇది పెనుముప్పుగా మారనుంది. దాన్ని నియంత్రించే వ్యవస్థ ఉండాలి. కృత్రిమ మేధ ప్రయోజనాలను పరిశీలిస్తే.. చాలా బాగున్నాయి.

డా.ఎల్‌.ప్రతాప్‌రెడ్డి, ప్రొఫెసర్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌, జేఎన్‌టీయూ, హైదరాబాద్‌


మానవ మేధకు మించింది లేదు..

మనం అనుకున్న వాక్యాన్ని ముందుగానే ఊహించి తెరపై కనిపించేలా చేయడం చాట్‌ జీపీటీ, ఏఐఎంఎల్‌ లక్షణాలు. దీన్ని ఉపయోగిస్తున్న విద్యార్థులు దానికి బానిసలుగా మారుతున్నారు. ఎప్పటికైనా మానవ మేధ గొప్పది. కృత్రిమ మేధ అద్భుతం అంటున్నవారు ప్రస్తుత పరిస్థితుల్లో ఈజిప్ట్‌ పిరమిడ్‌ను నిర్మించగలరా?.

నవీన్‌కుమార్‌, సంచాలకుడు, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని