logo

పంటితో పసిడి గొలుసు చోరీ

జనంతో రద్దీగా ఉన్న ప్రాంతాలు, బస్సుల్లోకి చేరి దొంగతనాలకు పాల్పడుతున్న మంగార్‌బస్తీ ముఠా ఆట కట్టించారు తూర్పుమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

Published : 29 Mar 2023 02:21 IST

బస్సుల్లో పురుషులే లక్ష్యంగా దొంగతనాలు

మాట్లాడుతున్న డీసీపీ సునీల్‌దత్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ చక్రవర్తి గుమ్మి తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: జనంతో రద్దీగా ఉన్న ప్రాంతాలు, బస్సుల్లోకి చేరి దొంగతనాలకు పాల్పడుతున్న మంగార్‌బస్తీ ముఠా ఆట కట్టించారు తూర్పుమండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. 8 మంది సభ్యులున్న ముఠా నాయకుడు, రిసీవర్‌ను అరెస్ట్‌ చేశారు. మంగళవారం బషీర్‌బాగ్‌ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తూర్పుమండలం డీసీపీ సునీల్‌దత్‌, టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ చక్రవర్తి గుమ్మి వివరాలు వెల్లడించారు. నాంపల్లిలోని మంగార్‌బస్తీ నివాసి కె.ఎస్‌.మక్కాన్‌(28) అలియాస్‌ కసబ్‌మక్కా, తెర్‌నామ్‌ పేర్లతో చలామణీ అవుతుంటాడు. మంగార్‌బస్తీ, అఫ్జల్‌నగర్‌, మల్లేపల్లి ప్రాంతాలకు చెందిన భోలా, మనం, సిఖిందర్‌, హిరా, బక్రి సిఖిందర్‌, ఖదీర్‌తో ముఠా కట్టాడు. రద్దీ ప్రదేశాలు, ఆర్టీసీ సిటీ బస్సు సర్వీసుల కేవలం పురుషుల మెడల్లోని బంగారు గొలుసులు కొట్టేయాలనే నిర్ణయానికి వచ్చారు.

ఎస్కార్ట్‌గా ఆటోలు.. : రద్దీగా ఉన్న ఆర్టీసీ సిటీ సర్వీసుల్లో ప్రయాణికులుగా ఎక్కుతారు. మెడలో బంగారు గొలుసులు ధరించిన పురుషులను ఎంపిక చేసుకుంటారు. ప్రయాణికుడి చుట్టూ మన్నన్‌, సిఖిందర్‌, హిరా, బక్రి సిఖిందర్‌, భోలా చేరుతారు. ప్రయాణికుడి దృష్టి మరల్చేందుకు హడావుడి చేస్తారు. అదే అదనుగా భోలా తన పంటితో ప్రయాణికుడి మెడలోని బంగారుగొలుసును తెంపుతాడు. కిందపడిన గొలుసును ముఠా నాయకుడు మక్కన్‌ చాకచక్యంగా తీసుకొని జేబులో వేసుకుంటాడు. అదే బస్సును అనుసరించి వస్తున్న ఆటోలో ఎక్కి మంగార్‌ బస్తీ చేరుతారు. కొట్టేసిన బంగారాన్ని శాలిబండకు చెందిన ప్రవీణ్‌ రమేష్‌ వర్మకు ఇస్తారు. ఈ దొంగల ముఠాపై హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమిషనరేట్లలో 37 కేసులున్నాయి. మంగళవారం బేగంబజార్‌లో నగలు విక్రయించేందుకు సిద్ధమవుతున్న మక్కన్‌ను, కొనుగోలు చేస్తున్న ప్రవీణ్‌రమేష్‌ వర్మను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.18.50 లక్షల విలువైన 343 గ్రాముల బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఆరుగురిని పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు డీసీపీ తెలిపారు. తూర్పుమండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ డి.సంతోష్‌కుమార్‌, అఫ్జల్‌గంజ్‌ డీఐ సతీష్‌, ఎస్సైలు వి.సత్యనారాయణ, సి.వెంకటేష్‌, కె.సంజీవరెడ్డి, ఎం.వేణుగోపాల్‌, ఎస్‌.దుర్గారెడ్డిని డీసీపీలు సునీల్‌దత్‌, చక్రవర్తి అభినందించి నగదు ప్రోత్సాహం అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని